Trinethram News : హైదరాబాద్ : సాయి సూర్య డెవలపర్స్ కేసులో టాలీవుడ్ సినీ హీరో మహేష్ బాబుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మరోసారి నోటీసులు ఇచ్చింది. సోమవారం విచారణకు హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చింది. గత నెల ఏప్రిల్ 28న విచారణకు హాజరు కావలసిందిగా మొదట నోటీసులు ఇచ్చింది. అయితే మహేష్ బాబు షూటింగ్‌లో బిజీగా ఉన్న కారణంగా ఈడీ అధికారులను సమయం కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన అధికారులు.. మే 12న (సోమవారం) విచారణకు హాజరు కావాల్సిందిగా అధికారులు పేర్కొన్నారు.
అయితే ఈ రోజు మహేష్ బాబు విచారణకు హాజరు అవుతారా.. లేదా అన్నదానిపై ఉత్కంఠత నెలకొంది. మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్ బ్రాండ్ ప్రమోషన్ చేశారు. అందుకు రెమ్యూనరేషన్ రూ. 5.9 కోట్లు తీసుకున్నట్లు ఈడీ అధికారులు గుర్తించారు. రూ. 3.4 కోట్ల నగదు, రూ. 2.5 కోట్లు ఆర్‌టీజీఎస్ ద్వారా తీసుకున్నట్లు గుర్తించారు. కాగా ఏప్రిల్ 16న హైదరాబాదులో సురానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్లలో ఈడీ అధికారులు సోదాలు చేసిన విషయం తెలిసిందే.
సూరానా గ్రూప్, సాయి సూర్య డెవలపర్లలో ఈడీ అధికారులు చేసిన సోదాల్లో భాగంగా సికింద్రాబాద్, బోయిన్‌పల్లిలోని సురానా ఇండస్ట్రీస్ ఎండీ నరేంద్ర సురానా ఇంట్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. సురానా ఇండస్ట్రీస్ అనుబంధ కంపెనీ, సాయి సూర్య డెవలపర్స్ సంస్థ ఎండీ సతీశ్ చంద్రగుప్త ఇంట్లో కూడా నగదును సీజ్ చేశారు. సాయి సూర్య, సురానా కార్యాలయాల్లో పలు డాక్యుమెంట్స్ కూడా స్వాధీనం చేసుకున్నారు. కొద్ది రోజుల క్రితమే సాయిసూర్య డెవలపర్స్‌కు చెందిన సతీశ్‌ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వట్టి నాగులపల్లిలో వెంచర్ పేరుతో డబ్బులు వసూలు చేసి సతీశ్ మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సైబరాబాద్ పోలీస్ కేసు ఆధారంగా సాయి సూర్య డెవలపర్స్‌పై ఈడీ విచారణ చేపట్టింది. సురానా సంస్థ పలు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి అక్రమ లావాదేవీలకు పాల్పడినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.
కాగా సునారా గ్రూప్ 3 బ్యాంకులకు రూ. 3,986 కోట్లు ఎగ్గొట్టింది. రుణాలు తిరిగి చెల్లించకపోవడంపై సీబీఐ మూడు కేసులు నమోదు చేసింది. సురానాకు అనుబంధంగా సాయిసూర్య డెవలపర్స్ పని చేస్తోంది. 2021 ఫిబ్రవరిలో సురానా కంపెనీలో జరిగిన ఈడీ సోదాల్లో రూ. 11 కోట్ల 62 లక్షల విలువైన బంగారం, నగదు సీజ్ చేశారు. సురానా గ్రూప్ అనుబంధ సంస్థలపై పీఎంఎల్ఏ కేసు కూడా నమోదు చేశారు. కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు దాడులు చేశారు..
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


