Chandrababu Naidu : నేడు ఉరవకొండ నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటన

TRINETHRAM NEWS

హంద్రీనీవా నీటి విడుదలకు ముహూర్తం ఖరారు చేసిన సీఎం చంద్రబాబు.

జులై 10వ తేదీన హంద్రీనీవా నీటిని విడుదల చేస్తామని ప్రకటన

రూ.3,873 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడి

Trinethram News : రాయలసీమ ప్రాంతానికి జీవనాడి అయిన హంద్రీనీవా సుజల స్రవంతి ప్రాజెక్టు ద్వారా జూలై 10వ తేదీన నీటిని విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గంలోని చాయాపురంలో హంద్రీనీవా పనులను నేడు క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ఆయన ప్రసంగించారు. ప్రాజెక్టులో ఫేజ్-1, ఫేజ్-2 కింద చేపడుతున్న 554 కిలోమీటర్ల కాలువ లైనింగ్, వెడల్పు పనుల కోసం ప్రభుత్వం రూ.3,873 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వెల్లడించారు.

గత ఐదేళ్ల పాలనలో హంద్రీనీవా పనులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని, ఫలితంగా ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని ముఖ్యమంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ ప్రాజెక్టు పనులకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి, వాటిని శరవేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టిందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును బనకచర్లతో అనుసంధానించడం పూర్తయితే రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీరు అందుతుందని, కరవు అనే మాటే వినిపించదని ధీమా వ్యక్తం చేశారు.

హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయితే ఫేజ్-1 కింద కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కలిపి సుమారు 1,98,000 ఎకరాలకు, ఫేజ్-2 కింద అనంతపురం, సత్యసాయి, కడప, చిత్తూరు జిల్లాల్లో మొత్తం 4,04,500 ఎకరాలకు సాగునీరు అందుతుందని సీఎం వివరించారు. ఈ నీటితో ఉద్యాన పంటలు సాగు చేసుకుంటే రైతుల ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుందని సూచించారు. మైక్రో ఇరిగేషన్ విధానానికి తమ ప్రభుత్వ హయాంలోనే శ్రీకారం చుట్టామని, దేశంలోనే 90 శాతం డ్రిప్ ఇరిగేషన్‌కు సబ్సిడీ ఇచ్చిన ఘనత తమదేనని గుర్తు చేశారు.

2014-19 మధ్య కాలంలో తమ ప్రభుత్వం నీటిపారుదల రంగం కోసం రూ.70 వేల కోట్లు ఖర్చు చేయగా, ఒక్క రాయలసీమలోనే రూ.12,441 కోట్లు వెచ్చించామని చంద్రబాబు తెలిపారు. హంద్రీనీవా కోసం రూ.4,200 కోట్లు ఖర్చు చేసి, కాలువ వెడల్పును 10 మీటర్ల నుంచి 16.5 మీటర్లకు పెంచామని, 40 టీఎంసీల నీరు తెచ్చేందుకు ఏర్పాట్లు చేశామని వివరించారు.

“గత ఐదేళ్లలో ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా? ఒక్క రోడ్డుకైనా మట్టి వేశారా? కాల్వల్లో గంప మట్టి తీశారా?” అంటూ గత ప్రభుత్వ పనితీరును ప్రశ్నించారు. కియా పరిశ్రమను అనంతపురం జిల్లాకు తీసుకురావడానికి ఆరు నెలల్లో గొల్లపల్లి ప్రాజెక్టును పూర్తి చేసి నీటి సమస్యను అధిగమించామని గుర్తుచేశారు.

ఉరవకొండ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని, టెక్స్‌టైల్ పార్క్ మంజూరు, గొట్టిపాడు వద్ద బ్రిడ్జి నిర్మాణం, కొట్టాలపల్లి లిఫ్ట్ ఇరిగేషన్, జీడిపల్లి నిర్వాసితులకు పరిహారం వంటి హామీలను నెరవేరుస్తామని తెలిపారు. చాయాపురం గ్రామస్థురాలు పార్వతి తన దీనస్థితిని వివరించగా, ఆమె కుటుంబానికి ఇల్లు, పిల్లల పేరిట డిపాజిట్లు, ఉపాధి కల్పిస్తామని సీఎం హామీ ఇచ్చారు. మార్గదర్శులుగా అనంతయ్య, రామకృష్ణలు పార్వతి కుటుంబానికి, చాయాపురంలోని మరికొన్ని కుటుంబాలకు అండగా నిలుస్తామని ముందుకు వచ్చారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chandrababu Naidu's visit to

You cannot copy content of this page

Scroll to Top