జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 25 at 10.30.38

TRINETHRAM NEWS

తాను అలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదని స్పష్టీకరణ.

తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధానార్చకుడు రమణ దీక్షితులుపై టీటీడీ ఫిర్యాదుతో తిరుమల వన్‌టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేసినట్టు సమాచారం. టీటీడీ పరిపాలన అంశాలు, అధికారులు, పోటు సిబ్బంది, జీయంగార్లపై రమణ దీక్షితులు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేసినట్టు సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ ప్రతిష్ఠ దిగజార్చేలా రమణదీక్షితులు వ్యాఖ్యలు చేశారంటూ టీటీడీకి చెందిన సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ సోషల్‌ మీడియా మానిటరింగ్‌ సెల్‌ అధికారి మురళీ సందీప్‌ శుక్రవారం రాత్రి 10 గంటలకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది.

దీనిపై పోలీసులు సెక్షన్‌ 153ఏ, 295, 295ఏ, 505(2), రెడ్‌విత్‌ 120 మేరకు కేసు నమోదు చేసినట్టు సమాచారం. మరోవైపు నిధుల కోసం ప్రయత్నిస్తున్నామంటూ రమణదీక్షితులు తమపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ అహోబిలం మఠం నుంచి కూడా టీటీడీకి శనివారం ఓ లేఖ అందింది.

ఇదిలా ఉండగా చాలాకాలం తరువాత శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో శ్రీవారి ఆలయంలో రమణదీక్షితులు ప్రత్యక్షం కావడం విశేషం. శ్రీవారిని దర్శించుకుని సుమారు గంటపాటు ఆలయంలోనే గడిపిన ఆయన చిరునవ్వుతో అందరినీ పలకరిస్తూ కనిపించారు. ఆలయం నుంచి వెలుపలకు వచ్చిన అనంతరం రమణదీక్షితులు మీడియాతో మాట్లాడారు.

ప్రస్తుతం ఆలయంలో కైంకర్యాలు సక్రమంగానే జరుగుతున్నాయా అనే ప్రశ్నకు బదులిస్తూ.. తరతరాలుగా చేసే కైంకర్యాలనే ఇప్పటికీ చూస్తున్నామన్నారు. సోషల్‌ మీడియాలో వచ్చిన వీడియో తనది కాదని ఇప్పటికే స్పష్టత ఇచ్చానన్నారు. తానెప్పుడు అలా మాట్లాడలేదని, అది తన స్వభావం, సంస్కృతి కాదన్నారు. చేయని తప్పునకు తనను బాధితుడిని చేస్తే ఏం చేయలేనన్నారు. పోలీసు కేసు అంశంపై మీడియా ప్రశ్నించగా ‘చూస్తాను’ అంటూ వెళ్లిపోయారు.

You cannot copy content of this page