
- తుమ్మిడిహెట్టి నిర్మాణంపై మహారాష్ట్రను ఒప్పించండి
- ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినతి
- ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026కు ప్రధానమంత్రికి ఆహ్వానం
Irrigation Projects : త్రినేత్రం న్యూస్ : ఢిల్లీ: తెలంగాణలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల అనుమతులు, అంతర్రాష్ట్ర వివాదాల పరిష్కారానికి సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ప్రాజెక్టుల పనులు వేగవంతం చేశామని, భూ నిర్వాసితులకు పరిహారం వేగంగా అందజేస్తున్నామని ప్రధానమంత్రికి సీఎం తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి అధికారిక నివాసంలో ఆదివారం సమావేశం అయ్యారు. సమావేశంలో కేంద్ర క్రీడా, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్ సుఖ్ మాండవీయ, రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పాల్గొన్నారు.
ప్రాణహిత నదిపై తుమ్మిడిహెట్టి ప్రాజెక్టును +152 మీటర్ల వద్ద నిర్మించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ఇటీవల మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌తో భేటీ అయిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మహారాష్ట్రలో ముంపునకు అవసరమైన పరిహారం ఇచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. తెలంగాణ సాగు నీటి అవసరాల దృష్ట్యా తుమ్మిడిహెట్టికి మహారాష్ట్రను ఒప్పించాలని ప్రధానమంత్రి మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. తుమ్మిడిహెట్టి ప్రాజెక్టుతో తెలంగాణలోని వెనుకబడిన, గిరిజన ప్రాంతాల సాగు, తాగు నీటి అవసరాలకు గ్రావిటీ ద్వారా నీటిని వినియోగించుకునే అవకాశం కలుగుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానమంత్రి మోదీకి తెలియజేశారు.
డాక్టర్ ఎస్.జైపాల్‌రెడ్డి పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐఎస్), సీతమ్మ సాగర్ బహుళార్థసాధక ప్రాజెక్టు (ఎస్‌ఎస్‌ఎంపీ), డిండి ఎత్తిపోతల పథకం (డీఎల్ఐఎస్)లపై రాష్ట్ర ప్రభుత్వం భారీగా వ్యయం చేసినా పర్యావరణ, ఇతర చట్టబద్ధమైన అనుమతులు పెండింగ్‌లో ఉండటంతో తాగు నీటి ప్రయోజనాలు అందడం లేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పర్యావరణ అనుమతుల విషయంలో ఇటీవల సుప్రీంకోర్టు సానుకూల తీర్పు ఇచ్చినందున ఏమాత్రం ఆలస్యం లేకుండా పర్యావరణ, ఇతర అనుమతులు ఇచ్చేలా చూడాలని పీఎం మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
సాస్కీ (Scheme for Special Assistance to States for Capital Investment) కింద తెలంగాణకు అదనంగా రూ.5,000 కోట్లు మంజూరు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో 70 నుంచి 90 శాతం మేర పూర్తయిన ప్రాజెక్టులకు ఈ నిధులు వినియోగించుకుంటామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ ఆర్థిక సంవత్సరంలోనే ఈ నిధులు మంజూరు చేస్తే కొత్త ఆయకట్టుతో పాటు స్థిరీకరించిన ఆయకట్టుకు సాగు నీరు సరఫరా చేసేందుకు వీలవుతుందని తెలిపారు. ఫలితంగా రైతుల ఆదాయం, గ్రామీణ ఉపాధి అవకాశాలు, ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరుగుతుందన్నారు.
సమ్మక్క సాగర్ ప్రాజెక్టుకు సంబంధించిన డీపీఆర్‌ను ఇప్పటికే కేంద్ర జల సంఘానికి (సీడబ్ల్యూసీ) సమర్పించామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. ఈ ప్రాజెక్టుతో ఛత్తీస్‌గఢ్ లో ముంపునకు గురయ్యే భూమి, గ్రామాల వివరాలను అంచనాకు పూర్తిస్థాయి నీటిమట్టం (ఎఫ్ఆర్ఎల్), బ్యాక్ వాటర్ స్థాయి గుర్తింపుతో కూడిన సమగ్ర సర్వేకు రూ.9.88 కోట్లు చెల్లించిన విషయాన్ని ప్రధానమంత్రి దృష్టికి సీఎం తీసుకెళ్లారు. ఛత్తీస్‌గఢ్‌కు భూ పరిహారం చెల్లించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఆ రాష్ట్రం నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) త్వరగా జారీ అయ్యేలా చూడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి కృషి సించాయీ యోజన (పీఎంకేఎస్‌వై) కింద ఇంటిగ్రేటెడ్ సమ్మక్క సాగర్ ప్రాజెక్టు-సీతారామ ఎత్తిపోతల పథకానికి రూ.5,183 కోట్లు, మోడికుంట వాగుకు రూ.392 కోట్లు, చిన్న కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.171 కోట్లు, చనాకా-కొరాటా బ్యారేజీకి రూ.103 కోట్లు మంజూరు చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని సీఎం రేవంత్ రెడ్డి కోరారు.
హైదరాబాద్‌లో డిసెంబరు నెలలో నిర్వహించనున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2026’ ప్రారంభ, ముగింపు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి ఆహ్వానించారు. ఆహ్వాన పత్రికను పీఎంకు సీఎం అందజేసి, గేమ్స్ లోగో, మస్కట్ల గురించి వివరించారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో దేశవ్యాప్తంగా ఉన్న 7,000 మందికి పైగా అత్యుత్తమ యువ క్రీడాకారులు పాల్గొననున్నారని, భవిష్యత్తులో ఆసియా క్రీడలు, ఒలింపిక్స్ వంటి ప్రతిష్ఠాత్మక అంతర్జాతీయ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించేందుకు వారికి ఇదొక చక్కని వేదిక కానుందని సీఎం ప్రధానమంత్రికి తెలియజేశారు. 2002లో జాతీయ క్రీడలు, 2007లో ప్రపంచ మిలిటరీ క్రీడలను విజయవంతంగా నిర్వహించిన చరిత్ర తెలంగాణకు ఉందని పీఎంకు సీఎం తెలిపారు.
- ‘ఖేలో ఇండియా’ లోగో, మస్కట్ ఆవిష్కరణ
తెలంగాణ వేదికగా వచ్చే డిసెంబరు 11 నుంచి 22వ తేదీ వరకు నిర్వహించనున్న 8వ ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్ – 2026’ అధికారిక లోగో, మస్కట్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఆదివారం దిల్లీలో ఆవిష్కరించారు. కేంద్ర మంత్రి అధికారిక నివాసంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు (క్రీడలు) ఏపీ జితేందర్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణీ ప్రసాద్, స్పోర్ట్స్ అథారిటీ ఎండీ సోనీబాలా దేవి తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాల్లో గేమ్స్ నిర్వహణకు స్టేడియాలు సిద్ధం చేసినట్లు కేంద్ర మంత్రి మాండవీయకు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 27 క్రీడాంశాల్లో 7,000 మందికి పైగా క్రీడాకారులు తలపడనున్నారని తెలిపారు. మూడేళ్లలోనే రాష్ట్ర క్రీడా బడ్జెట్‌ను రూ.113 కోట్ల నుంచి రూ.465 కోట్లకు పెంచినట్లు సీఎం కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
రాష్ట్రంలో ఇప్పటికే 61 మినీ స్టేడియాల నిర్మాణం పూర్తి కాగా, మరో 15 స్టేడియాల పనులు వివిధ దశల్లో ఉన్నాయని కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe