సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Sujatha Salman

అల్లూరి జిల్లా డుంబ్రిగూడ సెప్టెంబర్ 19, (త్రినేత్రంన్యూస్): డుంబ్రిగూడ మండలం సొవ్వ పంచాయతీ పరిధిలోని చమడపాడు రోడ్డు పరిస్థితి అధ్వానంగా మారినా అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడం తీవ్ర నిర్లక్ష్యానికి నిదర్శనమని సామాజిక కార్యకర్త, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు సుజాత సల్మాన్ విమర్శించారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించి నిధులు, బిల్లులు మంజూరవుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలకు ఉపయోగపడే స్థిరమైన రహదారి కనిపించడం లేదని ఆమె ఆరోపించారు.
ఏళ్లు గడుస్తున్నా రోడ్డు పనులు పూర్తికాకపోవడంతో స్థానిక ప్రజలు, విద్యార్థులు, రైతులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వర్షాకాలంలో రహదారి పరిస్థితి మరింత దారుణంగా మారుతోందని పేర్కొన్నారు. ప్రజల కోసం కేటాయించిన నిధులు కాగితాలపై బిల్లులకే పరిమితమైతే ప్రజలు ఎవరిని ప్రశ్నించాలని సుజాత సల్మాన్ ప్రశ్నించారు. రోడ్డు నిర్మాణం జరిగినట్లు రికార్డుల్లో చూపిస్తూ, క్షేత్రస్థాయిలో పనులు పూర్తికాకపోతే అది ప్రజాధనానికి అన్యాయం చేసినట్లేనని పేర్కొన్నారు. దీనిపై సంబంధిత అధికారులు స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నిధులు.. బిల్లుల వివరాలు వెల్లడించాలి….. చమడపాడు రోడ్డు పనులకు మంజూరైన నిధులు, ఇప్పటివరకు విడుదలైన బిల్లులు, కాంట్రాక్టర్ వివరాలు, పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలు, అధికారుల తనిఖీ నివేదికలను ప్రజల ముందుంచాలని ఆమె కోరారు. రోడ్డు పనులపై స్వతంత్ర సాంకేతిక తనిఖీ నిర్వహించి, నాణ్యతను పరిశీలించాలని డిమాండ్ చేశారు.
నిధుల వినియోగంలో ఏవైనా అక్రమాలు లేదా నిర్లక్ష్యం జరిగినట్లు విచారణలో తేలితే సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారులు, బాధ్యులపై చట్టపరమైన, శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.
పనులు పూర్తి చేయకపోతే ఆందోళన
“ప్రజల రాకపోకలకు అవసరమైన రహదారి నిర్మాణం కూడా ఏళ్ల తరబడి పూర్తి చేయలేని పరిస్థితి ఉంటే అభివృద్ధి ఎక్కడ జరిగింది? గిరిజన ప్రాంతాల ప్రజల సమస్యలను ఇకనైనా అధికారులు నిర్లక్ష్యం చేయకూడదు. చమడపాడు రోడ్డు పనులను తక్షణమే పూర్తి చేసి, నాణ్యతతో కూడిన శాశ్వత పరిష్కారం చూపాలి. లేనిపక్షంలో ప్రజలతో కలిసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేపడతాం” అని సుజాత సల్మాన్ హెచ్చరించారు.
ప్రజాధనం ప్రజల అవసరాల కోసమే వినియోగించాలి తప్ప బిల్లులకే పరిమితం కాకూడదని ఆమె అన్నారు. చమడపాడు రోడ్డు వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని ఆమె డిమాండ్ చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page