ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Sujatha Salman

Sujatha Salman : అల్లూరిజిల్లా, అరకులోయ ఆగస్టు 27, (త్రినేత్రం న్యూస్): విశాఖపట్నం (ఏపీటీడబ్ల్యూ) మరికవలస పాఠశాల విద్యార్థులను హడావిడిగా ఇతర ప్రాంతాలకు తరలించడంపై సామాజిక కార్యకర్త, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు సుజాత సల్మాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు, గిరిజన సంఘాలు, ప్రతిపక్ష పార్టీల ఆందోళనలపై ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమన్నారు.
మంగళవారం రాత్రి విద్యార్థులను అకస్మాత్తుగా తరలిస్తున్నారంటూ తల్లిదండ్రుల నుంచి సమాచారం అందడంతో సుజాత సల్మాన్ మధురవాడలోని పాఠశాలను సందర్శించారు. గంటల తరబడి తిండి, తాగునీరు, సరైన సమాచారం లేకుండా తమ పిల్లల కోసం ఎదురు చూస్తున్న తల్లిదండ్రులతో ఆమె మాట్లాడారు.
అనంతరం బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన వసతి సౌకర్యాలను పరిశీలించారు. ఒకే గదిలో 50 మందికి పైగా విద్యార్థులను ఉంచడం, బెడ్లు, ఫ్యాన్లు వంటి కనీస సౌకర్యాలు లేకపోవడంతో గచ్చుపైనే విద్యార్థులు నిద్రించే పరిస్థితి నెలకొనడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సరైన వసతి, భద్రతా ఏర్పాట్లు చేయకుండానే విద్యార్థులను తరలించడం బాధ్యతారాహిత్యమని విమర్శించారు.
బాలికల పాఠశాల, వసతి ప్రాంగణంలో 6వ తరగతి నుంచి 8వ తరగతి వరకు బాలురను ఉంచడంపై కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత విషయంలో ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితులు విద్యార్థుల తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు దారితీస్తున్నాయని సుజాత సల్మాన్ తెలిపారు. తమ పిల్లలు ఎక్కడ ఉన్నారో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, విద్యార్థులను తరలించే ముందు తల్లిదండ్రులకు పూర్తి సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు.
విద్యార్థులకు వెంటనే బెడ్లు, ఫ్యాన్లు, తాగునీరు, భోజనం, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు. బాలురు, బాలికలకు ప్రత్యేకమైన, సురక్షితమైన వసతి ఏర్పాటు చేయడంతో పాటు బాలికల వసతి గృహాల్లో 24 గంటల భద్రత కల్పించాలన్నారు. విద్యార్థుల విద్యకు అంతరాయం కలగకుండా శాశ్వతమైన, సురక్షితమైన ఏర్పాట్లు చేయాలని కోరారు.
“పిల్లల భద్రత, విద్య, భవిష్యత్తుతో ప్రభుత్వం ఆటలు ఆడకూడదు. తల్లిదండ్రులకు భరోసా కల్పించి, విద్యార్థులకు తక్షణమే అన్ని వసతి సౌకర్యాలు కల్పించాలి. సమస్యను పరిష్కరించకపోతే విద్యార్థులు, తల్లిదండ్రులు, గిరిజన సంఘాలతో కలిసి మరింత పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతాం” అని సుజాత సల్మాన్ హెచ్చరించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page