
రైతులకు పట్టాలు.. ప్రతి గ్రామానికి తాగునీరు.. అర్హులందరికీ పెన్షన్లు, ఇందిరమ్మ ఇళ్లు – మండల స్థాయి సమీక్ష. –ఎమ్మెల్యే బాలు నాయక్ .
Systematic Measures Development : డిండి, ఆగస్టు 12: త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రం లో నీ ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మండల స్థాయి సమీక్ష సమావేశంలో వివిధ శాఖల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై ఎమ్మెల్యే సమీక్ష నిర్వహించారు. మండలంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకు అన్ని గ్రామాలలో అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ అన్నారు
ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ అధికారులు అర్హత ఉన్న రైతులకు భూ పట్టాలు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. కొత్తగా పట్టాలు పొందిన రైతులు అర్హతల మేరకు రైతు భరోసా, రైతు బీమా కోసం దరఖాస్తు చేసుకోవాలని, ఫార్మర్ రిజిస్ట్రేషన్‌ను కూడా త్వరగా పూర్తి చేసుకోవాలని సూచించారు.
“డిండి మండలంలో అర్హత ఉన్న రైతులందరికీ పట్టాలు అందేలా చర్యలు తీసుకుంటాం. భూమి ఉన్న ప్రతి అర్హ రైతుకు ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తాం” అని ఎమ్మెల్యే తెలిపారు.
ఉపాధి హామీ పనులతో గ్రామాల అభివృద్ధి
ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో అవసరమైన అభివృద్ధి పనులను చేపట్టాలని ఎమ్మెల్యే అన్నారు. జలసిరి పనులతో పాటు గొర్రెలు, బర్రెల షెడ్లు, పండ్ల తోటలు వంటి పనులను అర్హతలకు అనుగుణంగా గ్రామపంచాయతీ తీర్మానంతో చేపట్టుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు.
డిండి ప్రాజెక్టు నీటిని పొదుపుగా వినియోగించాలి
డిండి ప్రాజెక్టు నుంచి ఇప్పటికే వ్యవసాయ అవసరాల కోసం నీటిని విడుదల చేశామని ఎమ్మెల్యే తెలిపారు. రైతులు నీటిని పొదుపుగా వినియోగించుకొని పంటల అభివృద్ధికి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ప్రతి గ్రామానికి తాగునీరు అందాలి
మిషన్ భగీరథ ద్వారా మండలంలోని ప్రతి గ్రామానికి నిరంతరంగా సురక్షితమైన తాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ఆదేశించారు. పైపులైన్లు, మోటార్లు తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని సూచించారు.
మహిళా సంఘాలకు మరింత ప్రోత్సాహం
మహిళా సంఘాలను మరింత బలోపేతం చేసి, వారికి స్వయం ఉపాధి, జీవనోపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని ఎమ్మెల్యే అన్నారు.
అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్
వృద్ధాప్య పెన్షన్‌తో పాటు ప్రభుత్వం అందిస్తున్న వితంతు, వికలాంగులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, గీత కార్మికులు, చేనేత కార్మికులు, హెచ్‌ఐవీ బాధితులు, ఫైలేరియా బాధితులు, డయాలసిస్ రోగులు తదితర అర్హత కలిగిన వర్గాల పెన్షన్లకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
“అర్హత ఉన్న ఏ ఒక్కరూ పెన్షన్‌కు దూరం కాకూడదు. అధికారులు అర్హులను గుర్తించి, నిబంధనల ప్రకారం పెన్షన్లు అందేలా చర్యలు తీసుకోవాలి” అని ఎమ్మెల్యే అన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్ష
డిండి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పనులపై సమీక్షించిన ఎమ్మెల్యే, ఇప్పటికే అధికారులు బాగా పనిచేస్తున్నారని, పెండింగ్‌లో ఉన్న కొద్దిపాటి ఇళ్లను కూడా త్వరలో పూర్తి చేయాలని సూచించారు. మండలంలో 45 గుడిసెలు ఉన్నట్లు అధికారులు గుర్తించారని, వాటికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే చర్యలు చేపడుతున్నామని* తెలిపారు. ఇళ్ల నిర్మాణంలో ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం స్లాబ్ ఏరియా 750 చదరపు అడుగుల లోపు ఉండేలా చూడాలని సూచించారు.
పశుసంవర్ధక శాఖపై ప్రత్యేక దృష్టి
పశుసంవర్ధక శాఖ ద్వారా రైతులకు పశువైద్య సేవలు, టీకాలు, పశువులకు అవసరమైన ఆరోగ్య సంరక్షణ, పశుపోషణపై అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే సూచించారు. పాడి, గొర్రెలు, మేకల పెంపకాన్ని ప్రోత్సహించి రైతుల ఆదాయం పెంచేలా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు.
నల్లగొండ–డిండి డబుల్ రోడ్డు పనులు
హామ్ రోడ్డు పద్ధతిలో నల్లగొండ నుంచి డిండి వరకు డబుల్ రోడ్డు పనులను మొదటి విడతలోనే పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. రహదారి పూర్తయితే డిండి మండలంతో పాటు నియోజకవర్గ ప్రజలకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందని అన్నారు.
“డిండి మండల అభివృద్ధే మా లక్ష్యం. రైతులు, మహిళలు, పేదలు, విద్యార్థులు, కార్మికులు, ప్రతి కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం చేరేలా అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి. ప్రజా సమస్యల పరిష్కారంలో ఎలాంటి జాప్యం ఉండకూడదు” అని ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో డీఎల్పీవో, ఎంపీడీఓ, తహసీల్దార్, వివిధ శాఖల మండల స్థాయి అధికారులు, గ్రామ కార్యదర్శులు, సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe