TRINETHRAM NEWS

సీఐటియు జిల్లా కార్యదర్శి ఉమామహేశ్వర్

అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్. అరకులోయ ఏప్రిల్ 15: రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు ఐక్య పోరాటాలు అత్యవసరమని సీఐటియు విశాఖ జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వర్ పిలుపునిచ్చారు. అరకువేలి మండలంలోని చోంపి గ్రామంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకుని సోమవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సాగర్ రాజకుమార్ అధ్యక్షత వహించారు.
డాక్టర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కొన్ని శక్తులు పథక బద్ధంగా ధ్వంసం చేయాలని చూస్తున్నాయని ఆయన ఆరోపించారు. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందాలన్నదే కేంద్రంలోని బీజేపీ ఆలోచనగా ఉందని తెలిపారు. ఇటీవల ముస్లింలు, క్రిస్టియన్లు మీద దాడులు పెరిగిపోయాయని, అట్టడుగు వర్గాలకు రాజ్యాంగం కల్పించిన హక్కులు.నిరాకరించబడుతున్నాయని అన్నారు.
వివక్షత గ్రామాల్లోనే కాకుండా, విశ్వవిద్యాలయ స్థాయిలోనూ కనిపిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటుపరచడం రాజ్యాంగ హక్కులకు విరుద్ధమని,ఇది కొనసాగితే రిజర్వేషన్లకు ముప్పు ఏర్పడుతుందని హెచ్చరించారు.
గిరిజనుల హక్కులు, చట్టాలను కాపాడాలంటే ముందుగా రాజ్యాంగాన్ని రక్షించాల్సిన అవసరం ఉందని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం.వ్యవహరిస్తోందని విమర్శించారు. రాజ్యాంగాన్ని నాశనం చేయాలని ఆర్ఎస్ఎస్ బీజేపీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ముద్దినాయుడు, పిసా ఉపాధ్యక్షులు, కార్యదర్శి దశరథ్, నూతన ప్రసాద్, దింస కళాకారుల సంఘం నాయకుడు పరుశురాం, సీపీఎం నాయకులు కోకేశ్వరరావు, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

United struggles are necessary