కొత్త బిల్లింగ్ యంత్రాలు.. సాఫ్ట్‌వేర్‌లో మార్పులు
హైదరాబాద్: నగరంలో సున్నా కరెంట్ బిల్లులకు రంగం సిద్ధమైంది. విద్యుత్తు బిల్లులతో ఆహార భద్రత(రేషన్) కార్డు అనుసంధానమైన వినియోగదారులకు గృహజ్యోతి వర్తించనుంది.
200 యూనిట్లలోపు విద్యుత్తు వాడకం ఉన్న అందరికీ ఈ నెల సున్నా బిల్లు రానుంది.
ఈ మేరకు బిల్లింగ్ సాఫ్ట్‌వేర్‌లో మార్పులు చేశారు. అందుకోసం కొత్త బిల్లింగ్ యంత్రాలు కొనుగోలు చేశారు. వీటి పనితీరును ఇప్పటికే పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. టెస్టింగ్ కోసం సున్నా బిల్లులు జారీ చేసి చూశారు. అంత సక్రమంగా ఉన్నట్లు ఇంజినీర్లు నిర్ధారించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మార్చి 1 శుక్రవారం నుంచి ఈ ప్రక్రియ అన్ని సెక్షన్లలో ప్రారంభించాలని సీఎండీ ఆదేశించారు. గురువారం అర్ధరాత్రి వరకైనా సరే ఫిబ్రవరి నెల ఖాతాలను ముగించి.. మార్చి వివరాలను బిల్లింగ్ యంత్రాల్లో లోడ్ చేయాలని ఆదేశించారు.
నగరంలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 48.06 లక్షల గృహ విద్యుత్తు కనెక్షన్లు ఉన్నాయి. ప్రజాపాలనలో జీహెచ్‌ఎంసీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కలిపి గృహజ్యోతికి 19.85 లక్షల మంది దరఖాస్తు చేశారు. ప్రభుత్వం ఆహార భద్రత కార్డు ఉన్నవారికే 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు అని ప్రకటించడంతో.. ఇప్పటివరకు 11 లక్షల మందే ఈ పథకానికి అర్హులుగా తేలారు.
అర్హత ఉండి సున్నా బిల్లు రాకపోతే..
మున్సిపల్, మండల కార్యాలయాల్లో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. ఆహార భద్రత కార్డు, దీనికి లింక్ చేసిన ఆధార్, గృహ విద్యుత్తు కనెక్షన్ల నంబర్‌ను దరఖాస్తుతోపాటు సమర్పించాలి. వీటిని విద్యుత్తు సిబ్బంది పరిశీలించి అర్హుల జాబితాలో చేరుస్తారు. తర్వాతి నెల నుంచి సున్నా బిల్లు వస్తుంది. అవసరమైతే సవరించిన బిల్లు జారీచేస్తారు. వీరు బిల్లు కట్టలేదని ఎలాంటి బలవంతపు చర్యలు ఉండవని కూడా సర్కారు ప్రకటించింది..
ప్రతి నెలా ఇచ్చిన మాదిరే మీటర్ రీడర్, సిబ్బంది వినియోగదారుడు ఇంటికి వచ్చి రీడింగ్ నమోదు చేస్తారు. మొత్తం వాడిన యూనిట్లు, అందుకయ్యే ఛార్జీ, సేవా రుసుములు, విద్యుత్తు సుంకం వంటి వివరాలన్ని ఎప్పటిలాగే నమోదు చేస్తారు. 200 యూనిట్లలోపు అయితే గృహజ్యోతి సబ్సిడీ ఎంత అనేది ఉంటుంది. ఆ తర్వాత నికర బిల్లు దగ్గర సున్నా చూపిస్తుంది..