TRINETHRAM NEWS

2025కల్లా 20 లక్షల మందికి నైపుణ్యం

మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్యా నాదెళ్ల

ముంబై :

నానాటికి కృత్రిమ మేధస్సు వినియోగం, అవసరం పెరుగుతున్న నేపథ్యంలో దానిపై దేశీయ యువతకు గ్లోబల్‌ టెక్నాలజీ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది.

ఈ క్రమంలోనే 2025కల్లా 20 లక్షల మంది భారతీయులకు ఏఐపై నైపుణ్యం పెరిగేలా ట్రైనింగ్‌ ఇవ్వబోతున్నట్టు మైక్రోసాఫ్ట్‌ చైర్మన్‌, సీఈవో, భారత సంతతికి చెందిన సత్యా నాదెళ్ల చెప్పారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన భారత్‌కు వచ్చారు. బుధవారం ఇక్కడ మాట్లాడుతూ.. ఈ కొత్త తరం టెక్నాలజీ అందరికీ సమానమైన వృద్ధిని అందివ్వగలదని అభిప్రాయపడ్డారు. 2025 నాటికి దేశంలో ఏఐ జీడీపీ 500 బిలియన్‌ డాలర్లను చేరగలదని అంచనా వేశారు. అలాగే ఓవరాల్‌ జీడీపీ 5 ట్రిలియన్‌ డాలర్లుగా ఉంటుందన్న ఆశాభావాన్ని కనబర్చారు.

ఏఐ రెగ్యులేషన్‌కు ఒక్కటై కదలాలి

కృత్రిమ మేధస్సు నియంత్రణకు సంబంధించి నియమ, నిబంధనల్ని సిద్ధం చేయడానికి భారత్‌, అమెరికా సహకారం తప్పనిసరి అని, అందుకు ఇరు దేశాలు కలిసి ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని సత్యా నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ఇక అంతకుముందు టాటా గ్రూప్‌ చైర్మన్‌ ఎన్‌ చంద్రశేఖరన్‌ను నాదెళ్ల కలిశారు. ఎయిర్‌ ఇండియాలో ఏఐ వినియోగంపై స్పందించారు. ఐటీసీ, అర్వింద్‌ సంస్థలతోపాటు ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ కూడా ఏఐ టూల్స్‌ను వాడుతున్నట్టు ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. కాగా, ఎస్బీఐ చైర్మన్‌ దినేశ్‌ ఖారాతోనూ ఆయన ఈ టూర్‌ లో భాగంగా భేటీ కావాల్సి ఉన్నది. తెలుగు వారైన సత్యా నాదెళ్ల పదేండ్ల క్రితం 2014 ఫిబ్రవరి 4న మైక్రోసాఫ్ట్‌ సీఈవోగా ఎన్నికైన విషయం తెలిసిందే.