
Trinethram News : Hyderabad : మలక్‌పేటలో వివాహిత శిరీష హత్య కేసులో కీలక మలుపు తిరిగింది. శిరీషను ఆమె ఆడపడుచు హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఇటీవల హైదరాబాద్ నగరంలోని మలక్‌పేటలో వివాహిత హత్య కలకలం రేపింది. అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు దర్యాప్తులో వెల్లడైన కీలక విషయాలను పోలీసులు వెల్లడించారు. శిరీష హత్య విషయం తెలిసినా దాన్ని బయటపెట్టకుండా తన సోదరితో కలిసి శిరీష భర్త.. ఆమె మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నారని…. శిరీషకు తొలుత మత్తుమందు ఇచ్చి, స్పృహ కోల్పోయిన తర్వాత ఊపిరాడకుండా చేసి చంపినట్లు పోలీసులు వెల్లడించారు.
2016లో వివాహం చేసుకున్న దంపతులిద్దరూ మలక్‌పేటలోని జమున టవర్స్‌లో నివాసం ఉంటున్నారు. గతంలో ప్రైవేటు ఉద్యోగం చేసిన వినయ్ ప్రస్తుతం ఖాళీగా ఉంటున్నాడు. శిరీష ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తోంది. 2019లో పాప జన్మించింది. వినయ్- శిరీష దంపతుల మధ్య పెళ్లయిన ఏడాది నుంచే తరచూ గొడవలు జరుగుతుండేవని.. శిరీష- వినయ్‌లతో పాటు అదే ఇంట్లో వినయ్ అక్క సరిత, ఆమె కుమారుడు, వినయ్ చెల్లెలు నివసించేవారని మృతురాలి బంధువులు తెలిపారు. ఈ క్రమంలోనే తరచూ శిరీష, వినయ్ సహా అతని కుటుంబసభ్యులతో గొడవలు జరుగుతుండేవని.. మరోవైపు శిరీష- సరిత ఇద్దరూ ఒకే ఆసుపత్రిలో పని చేస్తున్న క్రమంలో ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకునే వారని తెలుస్తోంది.
వరుస గొడవల నేపథ్యంలో శిరీషను అంతమొందించాలనుకున్న ఆడపడుచు సరిత… తొలుత ఆమెకు మత్తుమందు ఇచ్చి.. అనంతరం దిండుతో ఊపిరాడకుండా నొక్కి చంపినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. గుండెపోటు రావడంతో శిరీషను ఆసుపత్రిలో చేర్పించామని మృతురాలి మేనమామకు ఫోన్ చేసి తెలపటంతో తాను వచ్చేంతవరకూ మృతదేహాన్ని అక్కడే ఉంచాలని కోరారు. అతను వస్తే శిరీష ఒంటిపై ఉన్న గాయాలు గుర్తిస్తారని శిరీష భర్త ఆమె మృతదేహాన్ని మాయం చేయాలని ప్రయత్నించాడు. పోలీసుల సహాయంతో శిరీష మేనమామ ఆమె మృతదేహానికి వైద్య పరీక్షలు నిర్వహించగా… ఊపిరాడకుండా చేసి చంపినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. దీంతో శిరీష భర్త వినయ్, ఆడపడుచులను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
