లోక్‌సభలో 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు
ఇంటర్నెట్‌డెస్క్: 14 మంది ప్రతిపక్ష ఎంపీలపై లోక్‌సభలో వేటు పడింది. వీరిని శీతాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు సభ నుంచి సస్పెండ్ చేశారు. తొలుత ఐదుగుర్ని సస్పెండ్ చేయగా… ఆ తర్వాత మరో 9 మందిపై వేటు పడింది. మొదట సస్పన్షన్‌కు గురైన వారిలో ప్రతాపన్, హిబీ ఈడన్, జోతి మణి, రమ్యా హరిదాస్, డీన్ కురియాకోస్ ఉన్నారు. సభాపతి ఆదేశాలను పూర్తిగా ఉల్లంఘించారనే కారణంగానే వీరిపై చర్యలు తీసుకొన్నట్లు తెలుస్తోంది.
టీఎన్ ప్రతాపన్, హిబీ ఈడన్, జోతిమణి, రమ్యా హరిదాస్, డీన్ కురియకోస్‌లు సభాపతి ఆదేశాలను ఉల్లంఘిస్తూ ప్రవర్తించిన తీరును తీవ్రంగా పరిగణిస్తూ ఈ తీర్మానం ప్రవేశపెడుతున్నాం’’ అని తొలుత పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రహ్లాద్ జోషీ సభలో పేర్కొన్నారు. ఈ తీర్మానం ఆమోదం పొందిన అనంతరం స్పీకర్ సభను మధ్యాహ్నాం 3 గంటల వరకు వాయిదా వేశారు.
లోక్‌సభలో భద్రతపై స్పీకర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సూచనలు అడిగారు. ఈ సందర్భంగా వచ్చిన కొన్ని మెరుగైన సలహాలను ఇప్పటికే ఆచరిస్తున్నారు. ఈ అంశంపై రాజకీయలు చేయవద్దు’’ అని ప్రహ్లాద్ జోషీ ప్రతిపక్షాలకు హితవు పలికారు. నిన్న లోక్‌సభలో అలజడికి బాధ్యత వహిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌షా రాజీనామా చేయాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
సాయంత్రం 3 గంటలకు సభ ప్రారంభం కాగానే పార్లమెంట్‌లో విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో బెన్నీ బెహనన్, వీకే శ్రీకందన్, మహమ్మద్ జావెద్, పీఆర్ నటరాజన్, కనిమొళి, కె.సుబ్రహ్మణ్యం, ఎస్‌ఆర్ పార్థిబన్, ఎస్ వెంకటేశన్, మాణికం ఠాగూర్‌ను సస్పెండ్ చేస్తూ సభలో ప్రహ్లాద్ జోషీ మరోసారి తీర్మానం ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. అనంతరం రేపు ఉదయానికి లోక్‌సభ వాయిదా పడింది.
అంతకు ముందు రాజ్యసభలో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ ఓబ్రియన్ కూడా సస్పెండ్ అయ్యారు. నిన్న లోక్‌సభలో చోటు చేసుకొన్న తీవ్ర భద్రతా లోపంపై చర్చించాలని ఆయన పట్టుబట్టారు.
బుధవారం పార్లమెంట్‌లో ఇద్దరు దుండగులు చొరబడిన విషయం తెలిసిందే. వీరికి మద్దతుగా బయట మరో నలుగురు పనిచేశారు. ఈ అలజడి నేపథ్యంలో పార్లమెంట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. భవనంలోకి ప్రవేశాలపై ఆంక్షలు విధించారు. ఎంపీలు ప్రవేశించే ‘మకర ద్వారం’ నుంచి ఇతరులు వెళ్లకుండా నిషేధం విధించారు. మీడియాపైనా ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముందస్తు భద్రతా తనిఖీలు నిర్వహించి మీడియా సిబ్బందికి పాసులు జారీ చేస్తున్నారు.