TRINETHRAM NEWS

Trinethram News : లక్నో : అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన మతాచారాలు నేటి నుంచి ఆరంభం కానున్నాయి. ఈ నెల 18న రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నారు.

22వ తేదీ మధ్యాహ్నం 12:20 గంటలకు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుంది. ఇందుకు సంబంధించిన వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర టస్టు వెల్లడించింది.

ఈ మేరకు రామజన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాట్లాడుతూ.. రామమందిరంలో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠకు సంబంధించిన మతాచారాలు మంగళవారం నుంచే ఆరంభం కానున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 18న రాముడి విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చనున్నట్లు తెలిపారు. జనవరి 22వ తేదీ మధ్యాహ్నం 12:20 గంటలకు విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు. ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం మధ్యాహ్నం ఒంటి గంట వరకు పూర్తయ్యే అవకాశం ఉందని వివరించారు. వారణాసికి చెందిన గణేశ్వర శాస్త్రి ద్రవిడ్ ముహుర్తాన్ని నిర్ణయించారని, ఆయనే ఆచార వ్యవహారాలను పర్యవేక్షించనున్నట్లు తెలిపారు. ప్రధాన ఆచార్యుడిగా కాశీకి చెందిన లక్ష్మీకాంత్ దీక్షిత్ వ్యవహరించనున్నారు.

రాముడి విగ్రహం బరువు 150 నుంచి 200 కిలోల వరకు ఉంటుందని చెప్పారు. 121 మంది ఆచార్యులు ఈ మతపరమైన క్రతువును నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, యూపీ గవర్నర్ ఆనందీ బెన్ పటేల్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో పాటు ఇతర ప్రముఖుల సమక్షంలో రామ విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందని చంపత్ రాయ్ పేర్కొన్నారు. ఈ నెల 23 నుంచి సాధారణ భక్తులు దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. దేశంలోని 130 కోట్ల మంది అయోధ్యకు రావొచ్చు. ఏ రోజు వచ్చిన భక్తులు ఆ రోజు దర్శనం చేసుకుని రాత్రి తిరిగి వెళ్లిపోయేలా ప్రణాళిక రచిస్తున్నామని చంపత్ రాయ్ చెప్పారు.