
Shetty Appalu Demands : అరకులోయ, జూలై 31, (త్రినేత్రం న్యూస్): డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్టీ సెల్ ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు డిమాండ్ చేశారు. గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి కేంద్ర కార్యాలయం పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న నిరుద్యోగ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులు, విద్యార్థి, యువజన విభాగాల నాయకులు, నిరుద్యోగ యువతకు పిలుపునిచ్చారు.
డీఎస్సీ నియామకాల్లో అవకతవకలపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలు వెలికితీయాలని కోరిన ఆయన, విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి నిరుద్యోగ యువకుడికి నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని అన్నారు.
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే నిరసన కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని శెట్టి అప్పాలు కోరారు. నిరసన కార్యక్రమాల్లో భాగంగా జూలై 31న జిల్లా కలెక్టర్లకు జిల్లా అధ్యక్షుల నేతృత్వంలో వినతిపత్రాలు సమర్పించడం, ఆగస్టు 3, 4 తేదీల్లో నియోజకవర్గ స్థాయిలో టౌన్‌హాల్ సమావేశాలు నిర్వహించడం, ఆగస్టు 6న రిలే నిరాహార దీక్షలు చేపట్టడం, ఆగస్టు 9, 10 తేదీల్లో భారీ ర్యాలీలు, రిలే నిరాహార దీక్షలను కొనసాగించడం జరుగుతుందని తెలిపారు.
ప్రజా సమస్యల పరిష్కారం, నిరుద్యోగ యువత మరియు విద్యార్థుల హక్కుల సాధనే వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని, ఈ ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేస్తామని శెట్టి అప్పాలు పేర్కొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe