Trinethram News : అమరావతి: ఏపీ అసెంబ్లీ పరిసరాల్లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. అసెంబ్లీ ముట్టడికి సర్పంచులు యత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారు. సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ‘చలో అసెంబ్లీ’కి పిలుపునిచ్చారు..
పోలీసుల కళ్లుగప్పి అసెంబ్లీ పరిసరాల వరకూ సర్పంచులు వచ్చారు. తమ డిమాండ్లు పరిష్కరించాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారిమళ్లించిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ఆ నిధులను సర్పంచుల ఖాతాల్లో వేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిధులను చట్టప్రకారం పంచాయతీలకు ఇవ్వాలని కోరారు. దీంతో పోలీసులు అప్రమత్తమై వారిని అడ్డుకున్నారు. లాఠీలతో కొడుతూ ఈడ్చుకెళ్లి బస్సుల్లో పడేశారు. ఈ ఘటనలో పలువురు సర్పంచులకు తీవ్ర గాయాలయ్యాయి..
అంతకుముందు పోలీసులు పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. సర్పంచుల చలో అసెంబ్లీకి వెళ్లకుండా పంచాయతీ ఛాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ను ఉయ్యురులో పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రతినిధులను మందడంలో అరెస్ట్ చేసి తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు..