TRINETHRAM NEWS

రైల్వే జనరల్‌ టికెట్ల కొనుగోలును మరింత సులభతరం చేయడంతో పాటు డిజిటల్‌, నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించేందుకు క్యూఆర్‌ కోడ్‌ సౌకర్యాన్ని రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది.

తొలి దశలో పైలెట్‌ ప్రాజెక్టు కింద విజయవాడ రైల్వేస్టేషన్‌తో పాటు డివిజన్‌ పరిధిలోని తెనాలి, ఏలూరు, రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేశారు. నగదుతో పని లేకుండానే నేరుగా ప్రయాణికులు క్యూఆర్‌ కోడ్‌ సాయంతో జనరల్‌ టికెట్లు కొనుగోలు చేయవచ్చు. టికెటు జారీ చేసే ఉద్యోగి నమోదు చేసిన గమ్యస్థాన వివరాలను ప్రయాణికుడు బుకింగ్‌ కౌంటరు ముందు ఏర్పాటు చేసిన తెర(స్కీన్‌) ద్వారా క్షుణ్నంగా పరిశీలించుకోవచ్చు. అనంతరం మొబైల్‌ ఫోన్‌లోని పేమెంట్‌ యాప్‌ ద్వారా క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే జనరల్‌ టికెట్‌ జారీ అవుతుంది. ఈ ప్రక్రియ ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని డీఆర్‌ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్‌ తెలిపారు. ఈ సందర్భంగా విజయవాడ సీనియర్‌ డీసీఎం వి.రాంబాబు, కమర్షియల్‌ సిబ్బందిని ఆయన అభినందించారు. ఈ సౌకర్యాన్ని క్రమంగా డివిజన్‌ వ్యాప్తంగా అన్ని రైల్వేస్టేషన్లలో అమలు చేస్తామని డీఆర్‌ఎం చెప్పారు.