
-సామాన్యుడి నడ్డి విరుస్తున్న ధరల పెరుగుదలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి
– దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్.
Prices of Essential Commodities : దేవరకొండ డివిజన్ అక్టోబర్ 08, త్రినేత్రం న్యూస్. నిత్యావసరాల ధరలు రోజురోజుకూ పెరిగిపోతూ సామాన్యుడి నడ్డి విరుస్తుంటే.. ధరలకు అడ్డుకట్ట వేయాల్సిన ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండటం దారుణమని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.గురువారం దేవరకొండ పట్టణంలో ఆయన మాట్లాడుతూ….రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం, ధరల పర్యవేక్షణలో వైఫల్యానికి సామాన్య ప్రజలే మూల్యం చెల్లిస్తున్నారని ఆయన విమర్శించారు. ముఖ్యంగా సన్నబియ్యం ధరలు కేవలం నాలుగు నెలల్లోనే సుమారు 25 శాతం వరకు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రస్తుతం పలు సన్నబియ్యం రకాలు కిలో రూ.65 నుంచి రూ.83 వరకు పలుకుతున్నట్లు మార్కెట్ నివేదికలు వెల్లడిస్తున్నాయని తెలిపారు.
రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి సాధించామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ.. ఉత్పత్తి పెరిగినప్పుడు ధరలు తగ్గాల్సింది పోయి బియ్యం ధరలు ఎందుకు ఆకాశాన్ని అంటుతున్నాయని రవీంద్ర కుమార్ ప్రశ్నించారు.ప్రభుత్వం అమలు చేస్తున్న సన్నబియ్యం పథకం సఫలమైతే.. మార్కెట్లో సన్నబియ్యం ధరలు ఎందుకు అదుపు తప్పుతున్నాయని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యం నాణ్యతపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి, మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్‌కు మధ్య ఉన్న పరిస్థితులను ప్రభుత్వం సమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు.ఆరుగాలం శ్రమించి పంట పండిస్తున్న రైతన్నకు కనీస మద్దతు ధర (MSP) కింద గిట్టుబాటు ధర దక్కడం లేదని, మరోవైపు వినియోగదారులు మాత్రం అధిక ధరలకు బియ్యం కొనుగోలు చేయాల్సి వస్తోందని అన్నారు.
రైతుకు గిట్టుబాటు ధర లేదు.. వినియోగదారుడికి అందుబాటు ధర లేదు.. మధ్యలో దళారులు మాత్రమే లాభపడుతున్నారన్న ఆరోపణలపై ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. బియ్యం మాత్రమే కాకుండా ఉల్లి, వెల్లుల్లి, పప్పులు, వంటనూనెల ధరలు కూడా సామాన్య కుటుంబాలపై అదనపు భారాన్ని మోపుతున్నాయని రవీంద్ర కుమార్ అన్నారు. ఉల్లి రూ.70, వెల్లుల్లి రూ.240, పల్లినూనె రూ.210, పెసరపప్పు రూ.125, కందిపప్పు రూ.165 వరకు ధరలు పెరిగాయని పేర్కొన్నారు. అయితే ఈ ధరలు ప్రాంతం, నాణ్యత, మార్కెట్‌ను బట్టి మారవచ్చని ఆయన అన్నారు.వంటింటి బడ్జెట్ తారుమారవుతున్నా పౌరసరఫరాల శాఖ ఏం చేస్తోందని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం నిత్యావసరాల ధరలను నిరంతరం పర్యవేక్షించి, అవసరమైన చోట మార్కెట్లో జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ ప్రభుత్వ వ్యవస్థలో నిత్యావసరాల ధరలను పర్యవేక్షించేందుకు రోజువారీ, వారపు ధరల సమాచారాన్ని సేకరించే వ్యవస్థ ఉన్నప్పటికీ, ధరల నియంత్రణ కోసం సమర్థవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.బ్లాక్ మార్కెట్, అక్రమ నిల్వలు, కృత్రిమ కొరత, అధిక మార్జిన్లపై తక్షణమే తనిఖీలు నిర్వహించాలని.. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రవీంద్ర కుమార్ డిమాండ్ చేశారు.ప్రజల జేబులు ఖాళీ అవుతుంటే ప్రభుత్వం ప్రేక్షక పాత్ర పోషించకుండా వెంటనే చర్యలు చేపట్టాలని అన్నారు. సన్నబియ్యం సహా అన్ని నిత్యావసరాల ధరలను నియంత్రించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో చర్యలు తీసుకుని సామాన్య ప్రజలపై పడుతున్న ధరల భారాన్ని తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe