అక్టోబర్ 29, 2026
TRINETHRAM NEWS
Poddu Baladev

Poddu Baladev : అరకులోయ,అక్టోబర్ 7,(త్రినేత్రం న్యూస్) : మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి, వారిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ డిమాండ్ చేశారు. శాశ్వతీకరణ ప్రక్రియ పూర్తయ్యే వరకు సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని కోరారు.
అరకువేలి, అనంతగిరి, డుంబ్రిగూడ పరిధిలోని వైద్య విధాన పరిషత్ కాంట్రాక్ట్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న సమ్మెకు అరకులోయ ఏరియా ఆసుపత్రిలో పొద్దు బాలదేవ్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సుమారు 14,700 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు జిల్లా, ఏరియా, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, బయోమెడికల్ ఇంజినీర్లు, రేడియోగ్రాఫర్లు, హెల్త్ అసిస్టెంట్లు, ఏఎన్‌ఎంలుగా దశాబ్దకాలంగా వైద్య సేవలు అందిస్తున్నారని తెలిపారు.
గత ప్రభుత్వం కాంట్రాక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కోసం జీఓ నంబర్లు 34, 35ను విడుదల చేసిందని, షెడ్యూల్డ్ ప్రాంతాల్లో పనిచేస్తున్న మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు సంబంధించి జీఓ నంబర్ 68 ఉందని ఆయన పేర్కొన్నారు. ఆయా జీవోలను అమలు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, రెండున్నరేళ్లు గడిచినా సమస్యలు పరిష్కారం కాలేదని ఆరోపించారు.
తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు గత నెల రోజులుగా నల్ల రిబ్బన్లు ధరించి విధులు నిర్వహించడంతో పాటు ముఖ్యమంత్రి, సంబంధిత మంత్రులు, ఉన్నతాధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించారని తెలిపారు. అయినప్పటికీ సమస్యకు పరిష్కారం లభించకపోవడంతో జేఏసీ ఆధ్వర్యంలో సమ్మెకు దిగాల్సి వచ్చిందన్నారు.
మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఉద్యోగుల సమ్మెకు ఆదివాసీ గిరిజన సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందని, ఉద్యోగుల పోరాటంలో భాగస్వామ్యం అవుతుందని బాలదేవ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్తులో చేపట్టే పోరాటాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ అండ్ హెల్త్ ఉద్యోగుల జేఏసీ నాయకులు రాంబాబు, ఉమాదేవి, సావిత్రి, సుబ్బలక్ష్మి, సోమేశ్ కుమార్, సింహాచలం, ఉష, బుజ్జి, రోజారాణి, జ్యోతిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page