Trinethram News 5th Jan 2024
తిరుమల నుంచి అయోధ్యకు లక్ష లడ్డూలు
అయోధ్య రామాలయ విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం సమీపిస్తోంది. మరో 17 రోజుల్లో భారత్లోనే అత్యంత అద్భుతమైన రామాలయం ప్రారంభం కానుంది. ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేయడంలో తలమునకలయ్యారు.
అయితే అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడికి తిరుపతి లడ్డూలు పంపనున్నట్లు ఆలయ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని చెప్పారు. లక్ష లడ్డూలను అయోధ్యకు చేరవేయనున్నట్లు ధర్మారెడ్డి వెల్లడించారు.
తిరుమలలోని అన్నమయ్య భవన్‌లో నిర్వహించిన ‘డయల్ యువర్ ఈవో’ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడారు. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5 వరకు తిరుమలలో ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నట్లు తెలిపారు. దేశంలో ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు ఈ సదస్సుకు హాజరవుతారని వెల్లడించారు. మరోవైపు శ్రీవారి భక్తులు నకిలీ వెబ్‌సైట్ల కారణంగా మోసపోకూవద్దని సూచించారు. అధికారిక వెబ్‌సైట్ ttdevasthanams.ap.gov.inలో మాత్రమే ఆర్జితసేవలు, దర్శనం, విరాళాలు, వసతి బుక్ చేసుకోవాలని ఆలయ ఈవో ధర్మారెడ్డి చెప్పారు.