TRINETHRAM NEWS

Trinethram News : వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో ఏపీ రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. పెన్షన్లను ఆపింది చంద్రబాబే అని విమర్శించారు. ఏపీ రాజకీయాలు మూడు విమర్శలు, ఆరు ఆరోపణలు అన్నట్టుగా సాగుతున్నాయి. ప్రతి నెల ఒకటో తారీఖున వృద్దులకు ఇచ్చే పెన్షన్లు అందజేసే వాలంటీర్లపై సిటిజన్ ఫర్ డెమోక్రసీ అనే ప్రైవేటు సంస్థ ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసింది. వాలంటీర్లతో పెన్షన్లు ఇప్పిస్తే ఓటర్లు ప్రభావితం అవుతారని, మోడల్ కోడ్ ఆఫ్ కండెక్ట్ ఉల్లంఘించడం కిందకు వస్తుందని ఫిర్యాదు చేసింది. దీనిపై స్పందించిన ఎన్నికల కమిషన్ వాలంటీర్లను ఎలాంటి పథకాల అమలుకు వినియోగించకుడదని ఏపీ ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.

దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన టీడీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెన్షన్ల పంపిణీపై చంద్రబాబు దొంగనాటకాలు ఆడుతున్నారని, పేదలపై ప్రేమ ఇప్పుడు వచ్చిందా అని విమర్శించారు. 2019లో జన్మభూమి కమిటీల ద్వారా పెన్షన్లను అందజేసినా తాము అడ్డుకోలేదని గుర్తు చేశారు. అప్పట్లో జన్మభూమి కమిటీల పేరుతో టీడీపీ కార్యక్తలే పంచారని పేర్కొన్నారు. అలాగే పసుపు కుంకుమ పేరుతో అక్కచెల్లెమ్మలకు రూ. 20 వేల చెక్కులు అందజేశారని గుర్తు చేశారు. అయినప్పటికీ ప్రజలు చంద్రబాబును నమ్మలేదని, ఈసారి కూడా ఇదే గతే పడుతుందని ధ్వజమెత్తారు.

గతంలో రైతులకు రుణమాఫీ చేస్తానని రైతులను వంచించారని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వ వద్ద డబ్బుల లేని కారణంగానే పెన్షన్లు ఇవ్వలేక పోతున్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో ఉద్యోగాలే ఇవ్వలేదన్న చంద్రబాబు.. ఇప్పుడు 1.60 లక్షల సచివాలయ సిబ్బందితో పెన్షన్లు పంపిణీ చేయాలని చెబుతున్నారు. అంటే మొన్నటి వరకూ సీఎం జగన్ ఉద్యోగాలే ఇవ్వలేదన్న చంద్రబాబుకు ఇప్పుడు 1.60 లక్షల మంది ఎక్కడి నుంచి వచ్చారని నిలదీశారు. ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్న నోటితోనే సచివాలయ ఉద్యోగాలు ఇచ్చామని ఒప్పుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. గత ఐదేళ్ల పాలనలో దాదాపు 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డిదే అని కొనియాడారు. 42 ఏళ్ల రాజకీయ అనుభవం, 14 ఏళ్ల ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబుకు ఇలా ఇంటింటికి పెన్షన్ అందించాలన్న ఆలోచనైనా వచ్చిందా అని ఎద్దేవా చేశారు.