అక్టోబర్ 12, 2026
TRINETHRAM NEWS
New Political Party

New Political Party : అరకులోయ సెప్టెంబర్ 22, (త్రినేత్రం న్యూస్) : విశ్వశాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయలో సైన్స్ యుగపు సమాజ్ పార్టీ (ఎస్‌ఎస్‌పీ) ఆవిర్భావ కార్యక్రమం సోమవారం జరిగింది. స్థానిక వెంకటేశ్వర కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు మిస్టర్ యూనివర్స్ పార్టీని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు.
కార్యక్రమానికి ముందు శాంతికి ప్రతీకగా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సమావేశంలో పార్టీ విధి విధానాలు, లక్ష్యాలను నాయకులు వివరించారు. సైన్స్ యుగంలోకి సమాజం ముందుకు సాగుతున్న తరుణంలో కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ప్రజలను వర్గీకరించడం అవివేకమని మిస్టర్ యూనివర్స్ పేర్కొన్నారు. తమ పార్టీ ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా విశ్వ సమాజ నిర్మాణం లక్ష్యంగా పనిచేస్తుందని తెలిపారు.
ఈ సందర్భంగా పార్టీ మేనిఫెస్టోను విడుదల చేశారు. దేశాలు, ప్రాంతాలు, జాతులు, ప్రజల మధ్య విభేదాలు లేని విశ్వ సమాజాన్ని స్థాపించడం, సామాజిక, ఆర్థిక, రాజకీయ సమానత్వాన్ని సాధించడం, ప్రతి పౌరుడికి స్వేచ్ఛ, సమాన న్యాయం, గౌరవం కల్పించడం తమ ప్రధాన లక్ష్యాలని నాయకులు వెల్లడించారు.
కులమతాలు లేని సమాజ నిర్మాణం, భూమిని జాతీయం చేయడం, వ్యక్తిగత ఆస్తి రద్దు, ప్రజలందరికీ కూడు, గూడు, గుడ్డ కల్పించడం, ప్రతి పౌరుడికి ఉపాధి, రక్షణ, సామాజిక భద్రత కల్పించడం వంటి అంశాలను మేనిఫెస్టోలో పొందుపరిచినట్లు తెలిపారు. దోపిడీ, పీడన లేని సమాజ నిర్మాణంతో పాటు కామన్ సివిల్ కోడ్ ఏర్పాటు, ఆంక్షలు లేని విశ్వ సమాజ నిర్మాణం తమ పార్టీ లక్ష్యాలని పేర్కొన్నారు. పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి ప్రజల హాజరు పరిమితంగానే ఉన్నప్పటికీ, పార్టీ ఆశయాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లి భవిష్యత్తులో ప్రజల ఆదరణ పొందేందుకు కృషి చేస్తామని ఎస్‌ఎస్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణయ్య తెలిపారు.
కార్యక్రమంలో కర్నూలుకు చెందిన పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి జె.వి. కృష్ణయ్య, ప్రకాశం జిల్లాకు చెందిన రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌.ఎం. రావు, పార్టీ కార్యవర్గ సభ్యులు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page