అక్టోబర్ 12, 2026
TRINETHRAM NEWS
Gurajada Apparao Jayanti

మహిళా హక్కులు, సమానత్వంపై గురజాడ ఆలోచనలు నేటికీ ఆదర్శం

Gurajada Apparao Jayanti : అరకులోయ సెప్టెంబర్ 22, (త్రినేత్రం న్యూస్): అరకు వ్యాలీలోని దండకారణ్య కాలేజీలో గిరిజన మహిళా సంఘం (అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం–ఐద్వా అనుబంధం) ఆధ్వర్యంలో మహాకవి గురజాడ అప్పారావు 164వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఎస్‌ఎఫ్‌ఐ మండల కార్యదర్శి ఐసుబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముందుగా గురజాడ అప్పారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ‘దేశమును ప్రేమించుమన్నా… మంచి అన్నది పెంచుమన్నా’ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భంగా గిరిజన మహిళా సంఘం జిల్లా గౌరవ అధ్యక్షురాలు వి.వి. జయ మాట్లాడుతూ.. సమాజంలో మహిళల హక్కులు, గౌరవం, సమానత్వం, స్వేచ్ఛ, అవకాశాల గురించి శతాబ్దంన్నర క్రితమే ధైర్యంగా, స్పష్టంగా మాట్లాడిన మహనీయుడు గురజాడ అప్పారావు అని అన్నారు. ఆయన రచనలు కేవలం తెలుగు సాహిత్య వికాసానికి మాత్రమే పరిమితం కాకుండా సమాజాన్ని చైతన్యపరిచి, ప్రజలను మేల్కొలిపి, మహిళా అభ్యుదయానికి మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు.
1892లో రచించిన ‘కన్యాశుల్కం’ తెలుగు సాహిత్యంతో పాటు భారతీయ సామాజిక చరిత్రలోనూ ఒక మైలురాయిగా నిలిచిందన్నారు. బాల్యవివాహాలు, కన్యాశుల్కం, పితృస్వామ్య ఆధిపత్యం, వేశ్యలపై ద్వంద్వ నైతికత వంటి సామాజిక సమస్యలను గురజాడ తన రచనలోని పాత్రల ద్వారా వ్యంగ్యంతో, ఘాటైన విమర్శలతో, మానవతా దృక్పథంతో ఎత్తిచూపారని వివరించారు.
సమాజం పురోగమించాలంటే మహిళల అభ్యున్నతి తప్పనిసరని గురజాడ స్పష్టం చేశారని అన్నారు. మహిళలకు విద్య అందితే కుటుంబం, సమాజం, దేశం అభివృద్ధి చెందుతుందని ఆయన చాటిచెప్పారని పేర్కొన్నారు. స్త్రీ, పురుషుల మధ్య సమాన హక్కులు, సమాన అవకాశాలే సమాజ అభివృద్ధికి పునాది అని గురజాడ భావించారని తెలిపారు. మహిళలు బలహీనులు కాదని, ఆలోచించి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ధైర్యం వారిలో ఉన్నాయని, ఆధునిక మహిళలు చరిత్రను తిరగరాయగలరనే సందేశాన్ని గురజాడ తన రచనల ద్వారా అందించారని అన్నారు.
ఈ కార్యక్రమంలో దండకారణ్య కాలేజీ ప్రిన్సిపాల్ రాజు, లెక్చరర్ కళ్యాణి, గిరిజన మహిళా సంఘం మండల అధ్యక్షురాలు శశికళ, జిల్లా జాయింట్ సెక్రటరీ సన్యాసమ్మ, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page