సెప్టెంబర్ 21, 2026
TRINETHRAM NEWS
New hope for farmers

New Hope for Farmers : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 30 ; దశాబ్దాలుగా కరువుతో అల్లాడుతున్న ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, వైఎస్ఆర్ కడప జిల్లాల్లోని మెట్ట ప్రాంతాల రైతుల జీవితాల్లో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కొత్త వెలుగులు నింపబోతోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్న సందర్భం రాష్ట్ర సాగునీటి చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని అన్నారు.

శ్రీశైలం జలాశయం నుంచి 43.53 టీఎంసీల కృష్ణా వరద జలాలను నల్లమల కొండల గుండా మళ్లించి, మొత్తం 4,47,300 ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో వెలిగొండ ప్రాజెక్టును రూపొందించారని ఆయన తెలిపారు. మార్కాపురం జిల్లాలో 3,08,700 ఎకరాలు, ప్రకాశం జిల్లాలో 27,400 ఎకరాలు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 27,200 ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 84,000 ఎకరాలకు సాగునీరు అందేలా ప్రాజెక్టు రూపకల్పన జరిగిందన్నారు. వెలుగొండ అంటే ఒక సాగునీటి ప్రాజెక్టు కాదు. తరతరాలుగా కరువుతో పోరాడిన రైతుకు భరోసా. నీటి కోసం ఎదురుచూసిన గ్రామాలకు జీవనాధారం.. ఉపాధి కోసం వలస వెళ్లిన కుటుంబాలకు సొంత గడ్డపైనే బతికే అవకాశం అని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

ఈ ప్రాంతాల్లో తీవ్ర వర్షాభావం, నీటి వసతుల లేమి కారణంగా ప్రజలు కరువు కాటకాలను ఎదుర్కొంటూ ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితులు ఉండేవని అన్నారు. వెలిగొండ ద్వారా సాగునీటితో పాటు కరువు, ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాల్లో లక్షలాది ప్రజలకు సురక్షిత తాగునీటి భరోసా లభిస్తుందని మంత్రి తెలిపారు. 4 జిల్లాల్లోని 30 మండలాలకు చెందిన 15.25 లక్షల మందికి కాలువల నెట్‌వర్క్ ద్వారా తాగునీటి సౌకర్యం, పశ్చిమ ప్రకాశంలోని 7 నియోజకవర్గాల్లో 1,657 ఆవాసాలకు తాగునీటి ప్రయోజనం కలగనుందన్నారు.

23 లక్షల ప్రజానీకానికి తాగునీరు అందించేందుకు ప్రాజెక్టు రూపకల్పన చేసినట్లు వెల్లడించారు. నల్లమలసాగర్ జలాశయం నిండటం, కాలువలు–చెరువులకు నీరు చేరడం వల్ల ఆయకట్టు ప్రాంతాల్లో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగి మెట్ట ప్రాంత వ్యవసాయ ముఖచిత్రమే మారే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం 30 నుంచి 60 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు కొన్ని ప్రాంతాల్లో సుమారు 8 మీటర్ల లోతులోనే అందుబాటులోకి వచ్చే అవకాశముందని ప్రాజెక్టు నివేదిక అంచనా వేసిందని పేర్కొన్నారు. నాడు 1996లో వెలిగొండకు శంకుస్థాపన చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు. నేడు అదే ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేసే చారిత్రక ఘట్టానికి ఆయన నాయకత్వం వహించడం అరుదైన సందర్భం.

ఒక నాయకుడి దూరదృష్టి మూడు దశాబ్దాల తర్వాత లక్షలాది మంది ప్రజల జీవితాలను ఎలా మార్చగలదో చెప్పడానికి వెలిగొండ ప్రత్యక్ష నిదర్శనం అని అచ్చెన్నాయుడు అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని పెండింగ్ పనులకు వేగం పెంచిందన్నారు. టన్నెల్-2లో మిగిలిన 4.924 కిలోమీటర్ల బోరింగ్‌ను 23 నెలల్లో పూర్తి చేయడం, హెడ్ రెగ్యులేటర్లు, సొరంగాలు, ఫీడర్ కాలువ తదితర కీలక పనులను వేగంగా ముందుకు తీసుకెళ్లడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. కేవలం 26 నెలల్లో దాదాపు రూ.2,402 కోట్ల విలువైన పనులు పూర్తి చేసినట్లు, నల్లమల కొండల్లో దాదాపు 18.8 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన రెండు భారీ సొరంగాలు ఇంజినీరింగ్ అద్భుతమని మంత్రి పేర్కొన్నారు.

ఈ రెండు సొరంగాల ద్వారా వరద సమయంలో కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు తరలించేలా వ్యవస్థను రూపొందించారని తెలిపారు. నల్లమలసాగర్ నుంచి తీగలేరు, గొట్టిపడియ, తూర్పు ప్రధాన కాలువల ద్వారా విస్తారమైన ఆయకట్టుకు సాగునీరు చేరుతుందని అన్నారు. ఆ వెలుగొండ నీరు రైతు పొలానికీ చేరితే అది కేవలం నీరు కాదు.. రైతు కుటుంబానికి ఆర్థిక భరోసా. చెరువులు నిండుతాయి, భూగర్భ జలాలు పెరుగుతాయి, బోర్లు బతుకుతాయి, పంటలు పండుతాయి, గ్రామాల్లో ఉపాధి పెరుగుతుంది. ముఖ్యంగా కరువు కారణంగా జరిగే వలసలకు అడ్డుకట్ట పడుతుంది.

అందుకే వెలిగొండను ఈ ప్రాంత ప్రజల జీవనరేఖగా చూడాలి అని అచ్చెన్నాయుడు అన్నారు. రైతుల సంక్షేమం, సాగునీటి భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమని పేర్కొన్నారు. నదుల అనుసంధానం నుంచి పోలవరం వరకు, హంద్రీ–నీవా నుంచి వెలిగొండ వరకు నీటిని సంపద సృష్టించే శక్తిగా మార్చాలన్నదే చంద్రబాబు ఆలోచన. నేడు వెలిగొండ జాతికి అంకితం కావడం ఒక ప్రాజెక్టు ప్రారంభం మాత్రమే కాదు, కరువు సీమలో రైతుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే కొత్త అధ్యాయం అని మంత్రి అచ్చెన్నాయుడు సూచించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page