Trinethram News : గన్నవరం :జనవరి 30
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వ రికి తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం ఆమె హైదరాబాద్ నుండి గన్నవరానికి ఇండిగో విమానంలో బయలు దేరారు.
గన్నవరం ఎయిర్ పోర్టు చేరుకున్న ఈ విమానంలో ల్యాండింగ్ సమయంలో సమస్య తలెత్తింది. సరిగ్గా విమానం ల్యాండింగ్ సమయంలో వీల్ తెరుచుకోలేదు. దీంతో వెంటనే అప్రమత్తమైన పైలెట్ విమానాన్ని మళ్లీ టేకాఫ్ చేయగా.. కొద్దిసేపు అలాగే గాల్లో చక్కర్లు కొట్టింది.
కొద్దిసేపు విమానం గాల్లోనే చక్కర్లు కొట్టడంతో ఏం జరుగుతోందో తెలియక ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. కాసేపటి తర్వాత ల్యాండింగ్ గేర్ తెరుచుకుని వీల్ బయటికి రావడంతో ఇండిగో విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది.
దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నారా భువనేశ్వరికి గన్నవరం ఎయిర్ పోర్టులో మాజీ మంత్రి దేవినేని ఉమా తదితరులు స్వాగతం పలికారు.నారా భువనేశ్వరి ఇవాళ రేపల్లె, పర్చూరు, ఒంగోలు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు.
చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ అయిన అనంతరం మరణించిన టీడీపీ కార్యకర్తలను కుటుంబా లను పరామర్శించి, వారికి రూ.3 లక్షల చొప్పున ఆర్థికసాయం అందించనున్నారు…