ఆగస్ట్ 24, 2026
TRINETHRAM NEWS
Md. Johnny Baba

ఆటో కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసింది

బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర నాయకులు: ఎండి. జానీబాబా.

Md. Johnny Baba : దేవరకొండ డివిజన్ ఆగష్టు 01, త్రినేత్రం న్యూస్ . ఎన్నికల సమయంలో ఆటో కార్మికులకు ఏడాదికి రూ.12,000 భృతి అందిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని పూర్తిగా విస్మరించి ఆటో కార్మికులను మోసం చేసిందని బీఆర్ఎస్ పార్టీ కార్మిక విభాగం రాష్ట్ర నాయకులు ఎండి. జానీబాబా ఆరోపించారు.
శనివారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు….రాష్ట్రంలో ఆటో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రయాణికులు తగ్గిపోవడంతో ఆదాయం లేక బ్యాంకు రుణాల కిస్తీలు చెల్లించలేక అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం వారి సమస్యలను పట్టించుకోవడం లేదని విమర్శించారు.
ఆర్థిక భారంతో కుటుంబాలను పోషించడం కూడా కష్టంగా మారిందని, కొంతమంది ఆటో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడే దుర్భర పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయకుండా మాట తప్పడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటుగా మారిందని విమర్శించారు.
ప్రభుత్వం వెంటనే ఎన్నికల హామీలను అమలు చేసి ఆటో కార్మికులకు ప్రకటించిన రూ.12,000 వార్షిక భృతి అందించాలని, వారి సంక్షేమం కోసం ప్రత్యేక చర్యలు చేపట్టి సామాజిక, ఆర్థిక భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే, ఆర్థిక ఇబ్బందులతో మృతి చెందిన లేదా ఆత్మహత్యలకు పాల్పడిన ఆటో కార్మికుల కుటుంబాలకు కనీసం రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.
ఈ సమావేశంలో సూక్య నాయక్, ఇసుబ్, చందు, పాండు, బొజ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page