Loan waiver survey from today
తొలి విడుతగా రేషన్ కార్డు లేని వారి వివరాలు మాత్రమే సేకరణ
యాప్‌లో క్షేత్రస్థాయి వివరాల అప్‌లోడ్
ఇతర కారణాలతో మాఫీ కాని రైతుల పరిస్థితి ప్రశ్నార్థకం
ఉమ్మడి జిల్లాలో రేషన్ కార్డు లేని రైతులు 72,500మందికిపైనే..
ఏఓల ఆధ్వర్యంలో సర్వే.. ఆ తర్వాత రైతుల సెల్ఫ్ డిక్లరేషన్
Trinethram News : నల్లగొండ, ఆగస్టు 27 : రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కారు పెడుతున్న కొర్రీలు, అనుసరిస్తున్న విధానాలతో రైతులు తీవ్రంగా మదన పడుతున్నారు. ఎలాంటి షరతులూ లేకుండా రైతులందరికీ 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఎన్నికల ముందు ప్రకటించినా, అధికారంలోకి వచ్చాక నానా కారణాలతో దాదాపు సగం మందికి కోత పెట్టడం దుమారం రేపింది. అన్నదాత ఆగ్రహానికి గురైన సర్కారు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించినా.. అది అసంపూర్తిగా ఉండడంతో విమర్శలు వస్తున్నాయి.
ఇప్పటి వరకు మూడు విడతలుగా రూ.2లక్షల వరకు మాఫీ చేశామని అంటున్న సర్కార్ తాజాగా పలు కారణాలతో ఆగిన మాఫీలను పూర్తిచేస్తామని ప్రకటించింది. కానీ.. తొలుత రేషన్ కార్డు లేని వారి వివరాలు మాత్రమే సేకరించి వారికి మాత్రమే రుణమాఫీ చేసే దిశగా చర్యలు తీసుకుంటుడడంతో మిగిలిన కారణాలతో ఆగిన వారి పరిస్థితి ఏంటదన్నది ప్రశ్నార్థకంగా మారింది.
రేషన్ కార్డు లేని వారికే మాఫీ వర్తింప చేస్తే బ్యాంకుల్లో పేర్లు ట్యాలీ కాలేదని, ఆధార్ కార్డు సరిగ్గా లేదని ఆపిన మాఫీ సంగతి ఏంటి అనే దానిపై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వకపోవడం మరింత గందరగోళానికి దారితీస్తున్నది. ఉమ్మడి జిల్లాలో రేషన్ కార్డు లేని కారణంగా రుణమాఫీకి దూరమైన రైతులు 72500మందికిపైగా ఉన్నట్లు వ్యవసాయాధికారులు గుర్తించారు. అందులో నల్లగొండ జిల్లాలో 35వేల మంది, సూర్యాపేట జిల్లాలో 21,916 మంది, యాదాద్రి భువనగిరి జిల్లాలో 15,584 మంది ఉన్నారు. మిగిలిన కారణాలతో మాఫీ కాని రైతులు ఎంతమంది అన్నదానిపై అధికారుల వద్ద సమాధానం లేదు.
రేషన్ కార్డు లేని వారి వివరాల సేకరణ..
రేషన్ కార్డు లేని కారణంగా రుణమాఫీ ఆగిన రైతుల వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం రైతు భరోసా రుణమాఫీ పేరుతో యాప్‌ను రూపొందించింది. ఈ యాప్‌లో నేటి నుంచి మండల వ్యవసాయ అధికారులు వివరాలు నమోదు చేయనున్నారు. ఆయా బ్యాంకుల నుంచి వివరాలు తీసుకొని మొదటగా ఇంటి యజమాని, ఆ తర్వాత భార్య, కుమారుడు, కూతురు, ఇతర కుటుంబ సభ్యుల వివరాలు, ఆధార్ కార్డు నెంబర్లు, తీసుకున్న రుణాలు వంటివి పరశీలించి రెండు లక్షల రూపాయల వరకు పొందు పరచనున్నారు. ఇది ఒక సెల్ప్ డిక్లరేషన్ పత్రంలో పొందుపరిచి సంబంధిత రైతుతో సంతకం చేయించి పంచాయతీ కార్యదర్శితో అటెస్టేషన్ చేయించనున్నారు. సంబందిత యాప్‌లో అప్‌లోడ్ చేయించే బాధ్యత మండల వ్యవసాయ అధికారులకు అప్పగించారు.
మిగిలిన రైతుల పరిస్థితి ఏంటి?
రుణమాఫీ అనేది రైతులలతోపాటు బ్యాంకర్లకు, వ్యవసాయ అధికారులకు బేతాలుడి ప్రశ్నలా మిగిలింది. మాఫీ అయిన వారికి ఓకే. కాని వారికి మాత్రం ఎందుకు కాలేదు, కారణం ఏంటిఅనేది అంతు చిక్కని ప్రశ్నగా మారింది. ఆధార్ కార్డుతో సంబంధిత సైట్‌లో చెక్ చేస్తే.. కుటుంబ సభ్యుల వివరాలు సరిగ్గా లేవు.. ఆధార్ నెంబర్ తప్పుగా ఉంది.. బ్యాంకు ఖాతాకు ఆధార్ కార్డుకు పేరు మ్యాచ్ అవడం లేదు వంటి సమాధానాలు వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో దాదాపు సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదనేది క్షేత్రస్థాయిలో పరిస్థితులు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా ప్రభుత్వం రేషన్ కార్డు లేనివారి వివరాలు సేకరిస్తుండగా.. రెండు లక్షల రుణం దాటిన వారు అదనపు డబ్బులు తిరిగి బ్యాంకులకు చెల్లించాలనే మెలిక కూడా పెట్టింది.
ప్రభుత్వం నిర్ణయం మేరకే మాఫీ
నల్లగొండ జిల్లాలో 35వేల మంది రైతులకు రేషన్ కార్డు లేక రుణమాఫీ కాలేదు. వారి వివరాలు సేకరించి వారు తీసుకున్న రుణం వివరాలు ప్రభుత్వం ఇచ్చిన యాప్‌లో అప్‌లోడ్ చేయాలి. ప్రతి మండల వ్యవసాయాధికారి క్షేత్ర స్థాయిలో సర్వేలో పాల్గొంటారు. రైతులు తమ వివరాలను మండల వ్యవసాయ అధికారులకు తెలియ చేయాలి. ఆ తర్వాత ప్రభుత్వ నిర్ణయం బట్టి మాఫీ జరుగుతుంది.
-శ్రవణ్ కుమార్, జిల్లా వ్యవసాయాధికారి, నల్లగొండ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App