Self-employment Loans : స్వయం ఉపాధి రుణాలతో గిరిజన నిరుద్యోగ యువతకు జీవనోపాధి అవకాశాలు

TRINETHRAM NEWS

ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి తిరుమణి శ్రీ పూజ

అల్లూరిజిల్లా,మార్చి 3, (త్రినేత్రం న్యూస్): అల్లూరి జిల్లాలోని గిరిజన నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తిరుమణి శ్రీ పూజ తెలిపారు. సోమవారం ఐటిడిఏ కార్యాలయంలోని తన ఛాంబర్‌లో పశుసంవర్ధక శాఖ, డిఆర్డిఏ (వెలుగు) అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, స్వయం ఉపాధి రుణాల ద్వారా గిరిజన యువత జీవితాల్లో ఆర్థిక స్థిరత్వం తీసుకురావాలని అధికారులకు సూచించారు. జిల్లాలోని 11 మండలాలకు సంబంధించి డిఆర్డిఏ వెలుగు మరియు గిరిజన ఆర్థిక సహకార సంస్థ (ట్రైకర్) ఆధ్వర్యంలో 984 యూనిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. అర్హులైన యువతీ యువకులు త్వరితగతిన దరఖాస్తులు సమర్పించాలని కోరారు.
ఒక్కో యూనిట్ ఖరీదు రూ.1 లక్ష కాగా, అందులో రూ.50 వేలు సబ్సిడీగా, రూ.40 వేలు ఉన్నతి పథకం క్రింద వడ్డీ లేని రుణంగా, రూ.10 వేలు లబ్ధిదారుడి వాటాగా ఉంటుందని వివరించారు. అభ్యర్థులు తమ దరఖాస్తులను సంబంధిత మండల వెలుగు అధికారులకు నేరుగా అందజేయాలని సూచించారు.
లబ్ధిదారులకు తాము పరిచయం ఉన్న వ్యాపార రంగాన్ని ఎంపిక చేసుకునే పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని, యూనిట్ ఎంపికలో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. మండల అభివృద్ధి అధికారి సమక్షంలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ జరుగుతుందని తెలిపారు. ఈ పథకం సమర్థవంతమైన అమలుకు జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ (వెలుగు) కన్వీనర్‌గా వ్యవహరించాలని పేర్కొన్నారు.
అలాగే పశుసంవర్ధక శాఖ ద్వారా త్వరలో ప్రారంభం కానున్న ‘గోకులం’ పథకం కింద మెరుగైన జాతి పాడి పశువులు, గేదెలను రైతులకు అందించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా కొయ్యూరు, పాడేరు మండలాల్లో పాడి రైతుల కుటుంబాలు అభివృద్ధి చెందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
దేశీవాళి కోళ్ల పెంపకానికి జిల్లాకు 1,466 యూనిట్లు పూర్తిస్థాయి సబ్సిడీతో కేటాయించబడినట్లు తెలిపారు. ఒక్కో యూనిట్ విలువ రూ.15 వేలుగా ఉండగా, లబ్ధిదారులకు అవగాహనతో పాటు శిక్షణ అందించాలని ఆదేశించారు. శాస్త్రీయ విధానాలు, వ్యాపార మెలుకువలు నేర్పి పూర్తి అవగాహన కల్పించాలని జిల్లా పశుసంవర్ధక శాఖాధికారి డా.వి.జయరాజు మరియు హిఫర్ ఇంటర్నేషనల్ సిబ్బందితో సమన్వయం చేసుకుని అమలు చేయాలని సూచించారు.
ఈ సమావేశంలో ఐటిడిఏ అసిస్టెంట్ ప్రాజెక్టు అధికారి (పివిటిజి) వి. వెంకటేశ్వరరావు, పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ డా. వేణుమాధవ్, డిఆర్డిఏ జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వి. మురళి, డిస్ట్రిక్ట్ ప్రాజెక్టు మేనేజర్ పి. కనకారావు, ట్రైకర్ అసిస్టెంట్ ఎన్. సీతారామయ్యతో పాటు 11 మండలాల వెలుగు అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

self-employment loans

You cannot copy content of this page

Scroll to Top