TRINETHRAM NEWS

లగచర్ల ఘటన.. పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్

Trinethram News : హైదరాబాద్, నవంబర్ 21: లగచర్ల ఘటనలో పోలీసులపై హైకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు విరుద్ధంగా తన భర్త పట్నం నరేందర్ రెడ్డి అరెస్టు జరిగిందని పట్నం శృతి హైకోర్టులో పిటిషన్ ధాఖలు చేశారు. పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసే సమయంలో అనుసరించాల్సిన నిబంధనలు పాటించలేదని పిటిషనర్ పేర్కొన్నారు. డీ.కే బసు కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పిటిషన్‌లో శృతి పేర్కొన్నారు. ప్రతివాదులుగా ఐజీ వి.సత్యనారాయణ, వికారాబాద్ ఎస్పీ కె. నారాయణరెడ్డి, బొమ్మరాస్పేట ఇన్స్పెక్టర్ శ్రీధర్‌రెడ్డి, ఎస్సై మహమ్మద్ అబ్దుల్ రవూఫ్ పిటిషనర్ చేర్చారు. ప్రతివాదులుగా ఉన్న పోలీసులపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలంటూ పట్నం శృతి కోరారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు రేపు(శుక్రవారం) విచారించే అవకాశం కనిపిస్తోంది.

కాగా.. వికారాబాద్ జిల్లా కలెక్టర్‌ ప్రతీక్ జైన్‌పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ దాడిలో పాల్గొన్న నిందితుల్లో ఒకరు.. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డితో ఎక్కువసార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కేసులో మాజీ ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లోని కేబీఆర్‌ పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం చర్లపల్లి జైల్లో నరేందర్ రెడ్డి ఉన్నారు.

అయితే అరెస్ట్ సమయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదంటూ పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో క్వాష్ పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిపై నిన్న(బుధవారం) వాదనలు ముగిశాయి. కాగా తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. నరేందర్ రెడ్డి తరపున గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు. అరెస్టు సమయంలో పోలీసులు కనీస నిబంధనలు పాటించలేదని తెలిపారు. హత్యాయత్నం కేసు తప్ప మిగిలిన సెక్షన్‌లన్నీ 5 సంవత్సరాలలోపు శిక్ష పడేవే అని చెప్పారు. ఘటన జరిగిన రోజు సురేష్‌‌తో పట్నం నరేందర్ ఎన్ని కాల్స్ మాట్లాడారు హైకోర్ట్ ప్రశ్నించింది. 71 డేస్‌లో 84 కాల్స్ ఉన్నందుకు అరెస్ట్ చేయడం సరికాదని న్యాయవాది తెలిపారు. అరెస్టు విషయాన్ని కనీసం కుటుంబసభ్యులకు కూడా చెప్పలేదన్నారు. సుప్రీం కోర్టు తీర్పులను కింది కోర్ట్ కనీసం పరిగణలోకి తీసుకోలేదని.. అరెస్ట్ గ్రౌండ్స్‌ను చూడకుండానే పట్నం నరేందర్ రెడ్డికి రిమాండ్ విధించారని తెలిపారు. పట్నం నరేందర్ ది అక్రమ అరెస్ట్ అని న్యాయవాది వాదించారు. ఎక్కడ కూడా పోలీసులు లీగల్ ప్రొసీడింగ్స్ ఫాలో కాలేదన్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యేను అరెస్ట్ చేశారన్నారు. 11వ తేదీ సంఘటన జరిగినప్పుడు నరేందర్ రెడ్డి అక్కడ లేరని.. సురేష్ అనే నిందితుడి కాల్ డేటా ఆధారంగా అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతున్నారన్నారు. 11వ తేదీ కేవలం ఒకే ఒక సారి సురేష్‌తో నరేందర్ రెడ్డి ఫోన్‌లో మాట్లాడినట్లు చెప్పారు. సుప్రీం కోర్టు తీర్పులను ఉల్లంఘించారని పిటిషనర్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదనలు వినిపించారు.

సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

లగచర్ల ఘటనలో ప్రభుత్వాన్ని అస్థిర పరించేందుకు కుట్ర చేశారని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. కలెక్టర్ మీద, అధికారుల మీద దాడులు చేయించారని.. అన్నింటికీ ప్రధాన సూత్రధారి పట్నం నరేందర్ రెడ్డి అని వాదించారు. నరేందర్ రెడ్డికి సంబంధించి ఎలాంటి ఆధారాలు ఉన్నాయని హైకోర్టు ప్రశ్నించింది. తన అనుచరులతో కలిసి స్కెచ్ వేశారని కోర్టుకు పీపీ తెలియజేశారు. ఎవరు అనుచరులు.. అతని హోదా ఏంటి అని ధర్మాసనం మరో ప్రశ్న వేయగా.. సురేష్ అనే వ్యక్తి పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు అని తెలిపారు. సంఘటన జరిగిన రోజు సురేష్ … నరేందర్ కాల్స్ మాట్లాడుకున్నారని చెప్పారు. అరెస్ట్ సందర్బంగా ఎలాంటి నియమాలు పాటించారని పీపీని హైకోర్టు అడిగింది. కేబీఆర్‌ పార్క్‌లో ఒక మాజీ ఎమ్మెల్యేను ఎలా అరెస్ట్ చేస్తారని ధర్మాసనం ప్రశ్నించగా… కేబీఆర్‌ పార్క్‌లో అరెస్ట్ చేయలేదని తన ఇంట్లో అరెస్ట్ చేశామని కోర్టుకు పీపీ తెలిపారు. వాదనలు ముగిసిన అనంతరం తీర్పును హైకోర్టు ధర్మాసనం రిజర్వ్ చేసింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App