మెదక్ : మెతుకు సీమలో ఇసుక వ్యాపారం మూడు ట్రాక్టర్లు… ఆరు టిప్పర్లు అనే చందంగా సాగుతోంది. జిల్లాలో ముఖ్యంగా మంజీరా, హల్దీవాగుల్లో ఇసుక నిల్వలున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా గ్రామాల శివారుల్లో నుంచి ఇసుక తరలిస్తున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కొత్త ఇసుక విధానం తేనుండడంతో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని భావిస్తున్నారు.
యథేచ్ఛగా తరలింపు..
జిల్లాలోని పాపన్నపేట, కొల్చారం, చిలప్‌చెడ్, మెదక్, హవేలిఘనపూర్ మండలాల్లో మంజీరా.. తూప్రాన్, వెల్దుర్తి, మాసాయిపేట, చిన్నశంకరంపేట, కొల్చారం, మెదక్ మండలాల్లో హల్దీవాగులు ప్రవహిస్తున్నాయి. పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణాలు బాగా పెరిగాయి. వీటితోపాటు పలు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ఆయా పనులకు కావాల్సిన ఇసుకను వ్యాపారులు, గుత్తేదారులు అనుమతుల పేరిట యథేచ్ఛగా తరలిస్తున్నారు. జిల్లా కేంద్రం మెదక్‌లో టీఎస్‌ఎంఐడీసీ ఆధ్వర్యంలో ఇసుక విక్రయ కేంద్రం ఏర్పాటు చేసినా కొన్ని నెలల కిందట మూతపడింది. దీంతో ఆయా మండలాల్లో అక్రమం వ్యాపారం జోరుగా సాగుతోంది. పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులిచ్చినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో ఇసుక అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం కొరడా ఝళిపించనుంది. 48 గంటల్లో అధికారులు తీరు మార్చకోకుంటే అనిశా, విజిలెన్స్ విభాగాలను రంగంలోకి దింపనుంది.
జిల్లాలో ఇదీ పరిస్థితి…
● తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి శివారులోని హల్దీ వాగులో నుంచి మట్టిని తవ్వి ఫిల్టర్ల ద్వారా కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారు. మూణ్నెల్లుగా దందా కొనసాగుతోంది. పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఒక్కో ట్రిప్పును రూ.3- 4వేలకు విక్రయిస్తున్నారు.
● మెదక్ పట్టణంలోని పసుపులేరు వాగు నుంచి ఇసుకను జోరుగా తరలిస్తున్నారు. రాత్రివేళల్లో మాత్రమే కొందరు వాగులో నుంచి తోడేస్తున్నారు. పట్టణ శివారులోని పుష్పలవాగు సమీపంలో ఫిల్టర్లు ఏర్పాటు చేసి మట్టితో కృత్రిమ ఇసుక తయారు చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి టిప్పర్ల ద్వారా పట్టణానికి వచ్చిన ఇసుకను విక్రయిస్తూ కొందరు వ్యాపారం చేస్తున్నారు.
● పాపన్నపేట మండలం ఎన్కేపల్లి, చిత్రియాల, గాజులగూడెం శివారులోని మంజీరా నది నుంచి రాత్రివేళ పలువురు ట్రాక్టర్ల ద్వారా అక్రమంగా ఇసుక తరలిస్తున్నారు.
● పెద్దశంకరంపేట మండలం ఉత్తలూరు టెంకటి వాగులో అక్రమంగా ఇసుక తవ్వుతున్నారు. పోలీసు, రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా కొనసాగిస్తున్నారు.
● హవేలిఘనపూర్ మండలం సర్ధన వద్దనున్న మంజీరా నది నుంచి వందల సంఖ్యలో టిప్పర్లలో ఇసుకను మరోచోటికి తరలించారు.
● కొల్చారం మండలం కొంగోడ్ హల్దీవాగు నుంచి పెద్ద ఎత్తున ఇసుక తరలుతోంది. గతంలో అభివృద్ధి పనులకు అనుమతులు తీసుకొని ఇసుకను టిప్పర్ల ద్వారా హైదరాబాద్‌కు తరలించారు.