ఎమ్మెల్యేగా గర్వపడుతున్నాను
నా ప్రతిపాదనను యువ మంత్రి లోకేష్ ముందుకు తీసుకు వెళ్ళారు
మంత్రిమండలి ఆమోదం తెలిపింది
ఇది కూటమి ప్రభుత్వ విజయం
మంత్రి లోకేష్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు ధన్యవాదాలు
మీడియాతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్
Trinethram News : రాజమహేంద్రవరం: చారిత్రక, సాంస్కృతిక, కళా రాజధాని రాజమండ్రికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాధించగలిగానని సిటీ ఎమ్మెల్యేగా దీనికి గర్వపడుతున్నానని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) చెప్పారు. రాజమండ్రి కేంద్రంగా తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలియచేయడం పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది కూటమి ప్రభుత్వ విజయమని అన్నారు. తిలక్ రోడ్డులోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో పదేళ్ళపాటు హైదరాబాద్ లో ఉన్న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయాన్ని ఇకపై రాజమండ్రి కేంద్రంగా ఏర్పాటు చేయాలని అభ్యర్థిస్తూ తాను 2024 ఆగస్టు 5న ఐటి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కు ప్రతిపాదన పంపించానని, దీనిపై పూర్తి వివరాలు పంపించాలని ఆయన సూచించడంతో 2024 సెప్టెంబర్ 17వ తేదీన అన్ని వివరాలు అందచేసినట్లు తెలిపారు.
ఆనాడు లోకేష్ తాత దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఈ విశ్వవిద్యాలయం స్థాపిస్తే నేడు ఆయన మనవడు లోకేష్ దీనికి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు కృషి చేశారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న గోదావరి పుష్కరాలు దృష్టిలో ఉంచుకుని మన తెలుగు వారసత్వం, చరిత్ర ప్రతిబింబించేలా రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యాలయం స్థాపించాలని కోరినట్లు ఆయన చెప్పారు. దీంతోపాటు బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, ఆంధ్ర మహిళా సంస్కృత కళాశాల ఏర్పాటు కావాలని కోరామని ఆయన చెప్పారు. దీనివల్ల బిఎ తెలుగు అభ్యర్థులకు ప్రాధాన్యం ఇచ్చినట్లవుతుందని సదనం కళాశాల పరిశీలనకు వెళ్ళిన సమయంలో కొందరు విద్యార్థులు చెప్పారని, దాన్ని దృష్టిలో ఉంచుకుని ఇవి కూడా ఏర్పాటు చేయాలని కోరానని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు వివరించారు.
రాజ రాజనరేంద్రుడు పరిపాలించిన రాజమహేంద్ర్రికి పూర్వవైభవం తెచ్చేందుకు తెలుగు విశ్వవిద్యాలయం ఇక్కడకు వచ్చే విధంగా తనవంతు చేసినకృషి ఫలించినందుకు గర్వంగా ఉందని, ఇది కూటమి ప్రభుత్వ విజయమని ఆయన హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ లో ఉన్న పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయానికి 2024-25 సంవత్సరానికి 1-6-2024 న తెలంగాణ విద్యార్థులకు మాత్రమే నోటిఫికేషన్ ఇచ్చారని, దీంతో యూనివర్సిటీ ఆంధ్ర రీజియన్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ వి నిరీక్షణబాబు ఈ విషయం మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి మనం నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని చెప్పారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు తెలిపారు. దాంతో తాను 2024 ఆగస్టు 5న మంత్రి నారా లోకేష్ కు దీని చరిత్ర వివరిస్తూ ఎన్టీఆర్ స్థాపించిన యూనివర్సిటీని మనవడిగా కొనసాగించాలని అభ్యర్థించినట్లు ఆయన పేర్కొన్నారు.
అన్ని కలిసి వచ్చి ఇప్పుడు తెలుగు విశ్వవిద్యాలయం రాజమండ్రి కేంద్రంగా బొమ్మూరులో ఏర్పాటు కానుందని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు చెప్పారు. తెలుగు విశ్వ విద్యాలయం బొమ్మూరు సాహిత్య పీఠానికి 50 ఎకరాల స్థలం ఉండేదని ఇటీవల అందులో 17 ఎకరాలకు పైగా జీపీసీఎల్, నాక్, కలెక్టర్ కార్యాలయం భవనాలకు కేటాయించారని ఆయన తెలిపారు. మిగిలిన ఎకరాల్లో తెలుగు విశ్వవిద్యాలయం 12 విభాగాలు ఏర్పాటు చేయడానికి సహచర ఎమ్మెల్యేలు ఎంపీ, మంత్రి కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. దీనిపై మంత్రి నారా లోకేష్ స్పందించి ఇది ప్రజల విజయమని వ్యాఖ్యానించారని ఎవరి చిత్రపటాలకి పాలాభిషేకం, పూల మాలలు వేయవద్దని కూడా సూచించారని ఆయన చెప్పారు.
తనకు సన్మానం చేసి శాలువాలు కప్పాలని అరిచి గీ పెట్టిన మాజీ ముఖ్యమంత్రి జగన్ కు, యువ మంత్రి నారా లోకేష్ కు ఉన్న తేడా ఇదేనని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు అన్నారు. తెలుగు విశ్వ విద్యాలయానికి రాజమండ్రి తోపాటు శ్రీశైలం, కూచిపూడిలో కూడా కేంద్రాలు ఉన్నాయని, వైసీపీ ఐదేళ్ళ పాలనలో రాజమండ్రి క్రైం హబ్ గా మారితే కూటమి అధికారంలోకి రాగానే కల్చరల్ హబ్ గా మార్చుతామని ఎన్నికల్లో తాను ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు తెలుగు విశ్వ విద్యాలయం సాధించి చూపించారని ఆయన సగర్వంగా చెప్పారు. మీడియా సమావేశంలో కూటమి నాయకులు కాశి నవీన్ కుమార్, వర్రే శ్రీనివాసరావు, మజ్జి రాంబాబు, బుడ్డిగ రాధా, వై.శ్రీను, కొయ్యల రమణ, బుడ్డిగ రవి, మరుకుర్తి రవి యాదవ్, మొకమాటి సత్యనారాయణ, అడబాల రామకృష్ణారావు పాల్గొన్నారు.
ప్రొఫెసర్ నిరీక్షణ బాబు కృతజ్ఞతలు :
హైదరాబాద్ నుంచి తెలుగు సాంస్కృతిక సాహిత్య రాజధాని రాజమండ్రికి తెలుగు విశ్వ విద్యాలయం తరలి వచ్చేందుకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కు కృషి చాలా ఉందని యూనివర్సిటీ ఆంధ్ర రీజియన్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ నిరీక్షణ బాబు తెలిపారు. ఆయన చేసిన ప్రతిపాదనపై స్పందించి రాజమండ్రిలో తెలుగు విశ్వ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, యువ మంత్రి నారా లోకేష్ కు యూనివర్సిటీ ఆంధ్ర రీజియన్ ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ ప్రొఫెసర్ నిరీక్షణ బాబు కృతజ్ఞతలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


