TRINETHRAM NEWS

హైదరాబాద్‌: గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగంపై భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్‌ రావు విమర్శనాస్త్రాలు సంధించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ ప్రసంగం విశ్వాసం కల్పించలేకపోయిందని.. ప్రభుత్వ విజన్‌ను ఆవిష్కరించలేకపోయిందన్నారు. ప్రభుత్వ హామీలు, గ్యారంటీల అమలుపై స్పష్టత ఇవ్వలేదని పేర్కొన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద ఆయన మాట్లాడారు.

‘‘ప్రజావాణి’ ప్రభావం చూపించలేకపోయింది. రోజూ విజ్ఞప్తులు స్వీకరిస్తామని చెప్పిన సీఎం రేవంత్‌ రెడ్డి.. ఒక్క రోజు మాత్రమే వెళ్లారు. ప్రస్తుతం పొరుగు సేవల సిబ్బంది మాత్రమే దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేశామని ప్రభుత్వం చెబుతోంది. నిజానికి వాటిని పాక్షికంగా అమలు చేశారు. గవర్నర్‌ ప్రసంగంలో ఆరోగ్యశ్రీ ప్రస్తావన లేదంటే దాని అమలు సరిగ్గా లేదని చెప్పకనే చెప్పారు. ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం వాయిదా వేశారు. మరో 10.. 15 రోజుల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే హామీల అమలు ఎలా సాధ్యపడుతుంది? మిగిలిన హామీల గురించి గవర్నర్‌ ప్రస్తావించలేదు. ప్రభుత్వ ఆలోచనలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’’ అని పేర్కొన్నారు.