Foundation stone laying of about 80 crore development works in Peddapalli Assembly Constituency on a single day
టెయిల్ ఎండ్ ప్రాంతాల సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తాం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క
*ఒకే రోజు పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో దాదాపు 80 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన
*ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు చర్యలు
*మహిళా సంఘాల ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు
*పెద్దపల్లిలో విస్తృతంగా పర్యటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
పెద్దపల్లి, సెప్టెంబర్-14: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ఎస్సారెస్పీ టెయిల్ ఎండ్ ప్రాంతాల సాగునీటి సమస్య శాశ్వత పరిష్కారం కోసం ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు పత్తిపాక రిజర్వాయర్ నిర్మిస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు.
శనివారం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్, జిల్లా కలెక్టర్ కోయ హర్ష లతో పాటు విస్తృతంగా పర్యటించారు.
జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలోని 132 కేవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు, పెద్దపల్లి మండలం రాఘవపూర్ గ్రామంలోని 33/11 కేవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు , ఎస్ఈ ఎన్.పి.డి.సి.ఎల్ బోన నిర్మాణ పనులకు, పెద్దపల్లి పట్టణంలోని మార్కెట్ యార్డ్ 33/11 కేవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు, పెద్దరాతి పల్లి 33/11 కేవి సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు, అమృత్ 2.0, టి.యూ.ఎఫ్.ఐ.డి.సి కింద చేపట్టిన త్రాగునీటి సరఫరా పనులకు, రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయ భవన నిర్మాణ పనులకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు.
అనంతరం జెండా చౌరస్తా ప్రాంగణంలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు
అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ,
ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర బడ్జెట్ లో పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి అవసరమైన నిధులు కేటాయించడం జరిగిందని, ప్రజల చిరకాల వాంఛ పత్తిపాక తప్పనిసరిగా నిర్మిస్తామని అన్నారు. దేశ తొలి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ప్రాజెక్టు లే ఆధునిక దేవాలయాలు అనే భావించి ఎస్సారెస్పీ ప్రాజెక్టు నిర్మించడం వల్లే పెద్దపల్లి ప్రాంతం అభివృద్ధి చెందిందని అన్నారు.
పెద్దపల్లి బైపాస్ రోడ్డు, ఓదెల మండలంలో మానేరు నదిపై బ్రిడ్జి నిర్మాణ పనులు సైతం ప్రజా ప్రభుత్వం మంజూరు చేసి సకాలంలో పూర్తి చేయడం జరుగుతుందని తెలిపారు. ఎల్లంపల్లి ప్రాజెక్టుపై ఉన్న లిఫ్ట్ కోసం అవసరమైన సబ్ స్టేషన్ నిర్మాణ పనులను వెంటనే మంజూరు చేస్తామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
ప్రజల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం రేవంత్ రెడ్డి నాయకత్వంలో వచ్చిందని, ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల అవసరాల కోసం మాత్రమే ఉంటుందని అన్నారు. పెద్దపల్లిలో భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని 30 కోట్ల రూపాయలతో 5 సబ్ స్టేషన్ పనులు శంకుస్థాపన చేయడం జరిగిందని అన్నారు.
అమృత్ 2.0 , టి.యూ.ఎఫ్.ఐ.డి.సి క్రింద 50 కోట్ల నిధులతో త్రాగునీటి సరఫరా పనులకు శంకుస్థాపన చేశామని అన్నారు. ప్రజల భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకొని 10 వేల కోట్ల రూపాయలతో పెద్దపల్లి జిల్లాలో 800 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణం మంజూరు చేశామని అన్నారు.
మహిళలకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల వ్యవధిలో ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించామని అన్నారు. ప్రతినెల మహిళ ఉచిత బస్సు ప్రయాణానికి ప్రభుత్వం 400 కోట్లు ఖర్చు చేస్తుందని ఉపముఖ్యమంత్రి తెలిపారు.
మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదిగే దిశగా ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం కింద మహిళా సంఘాలకు రాబోయే ఐదు సంవత్సరాలలో లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలు అందించడం జరుగుతుందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున సోలార్ ప్లాంట్లు తీసుకొని వస్తామని, వీటిని మహిళా సంఘాల ద్వారా ఏర్పాటు చేసే ప్రతిపాదనలు పరిశీలిస్తున్నామని ఉప ముఖ్యమంత్రి తెలిపారు.
జూలపల్లి మండలం కాచాపూర్ గ్రామంలో 132/33 కేవి సబ్ స్టేషన్ నిర్మాణం పనులకు శంకుస్థాపన చేశామని, పైలెట్ ప్రాజెక్టు కింద అక్కడ సమీపంలో మరో 12 ఎకరాల భూమి సేకరించి మహిళల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు. ప్రభుత్వం కల్పించే ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ మహిళలు ఆర్థికంగా ఎదగాలని పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ, సబ్ స్టేషన్ల నిర్మాణం, అమృత్ 2.0 క్రింద 25 కోట్లతో త్రాగునీటి సరఫరా పనులు, టి.యూ.ఎఫ్.ఐ.డి.సి క్రింద 30 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది.
ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసామని, రాబోయే రోజుల్లో పనులు ప్రారంభించి చిట్టచివరి ఆయకట్టుకు సాగునీరు అందేలా ప్రాజెక్టు నిర్మిస్తామని అన్నారు.
ఓదెల మండలానికి సంబంధించి మానేరు నది పై బ్రిడ్జి నిర్మాణం , పెద్దపల్లి బైపాస్, సుల్తానాబాద్ బైపాస్ పనులు చేసేందుకు ముఖ్యమంత్రి సూచనప్రాయంగా ఆమోదం తెలిపారని, వీటి పనులు త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. యువతకు ఉపాధి అందించే దిశగా టాస్క్ రీజనల్ సెంటర్ ను పెద్దపల్లిలో ఏర్పాటు చేశామని అన్నారు.
ఇండ్లు లేని పేదలకు ఇందిరమ్మ ఇండ్ల కింద ఈ సంవత్సరం 3500 ఇండ్లు పెద్దపల్లి నియోజకవర్గం లో మంజూరు చేయబోతున్నామని తెలిపారు. రైతు సోదరులకు 2 లక్షల రుణమాఫీ పథకం అమలు చేశామని, సాంకేతిక సమస్యలను పరిష్కరించి మిగిలిన అర్హులైన రైతులకు కూడా రుణమాఫీ కచ్చితంగా చేయడం జరుగుతుందని అన్నారు.
గడిచిన 9 నెలల కాలంలో ఒక్కటి తర్వాత ఒక్కటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రాజు ఆరోగ్య శ్రీ పరిమితి 10 లక్షల పెంపు, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ సరఫరా వంటి కార్యక్రమాలను అమలు చేశామని అన్నారు.
*పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు మాట్లాడుతూ పెద్దపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణం మంజూరు చేయాలని, అదేవిధంగా పెద్దపల్లిలో బస్సు డిపో మంజూరు చేయాలని ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రిని కోరారు. పెద్దపల్లి నుంచి జమ్మికుంట పోయే రోడ్డు పొత్కల్లపల్లి నుంచి వెళ్లే విధంగా రోడ్డు వేస్తే 14 కిలో మీటర్లు తగ్గుతుందని , ఓదెల మండలం శ్రీరాంపూర్ మండలంలోని రైతులకు చాలా ఉపయోగపడుతుందని, ఆ బ్రిడ్జి త్వరగా మంజూరు చేయాలని ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
టెయిల్ ఎండ్ ప్రాంతాల ప్రజలకు శాశ్వత సాగునీటి సమస్య పరిష్కరించేందుకు పత్తిపాక రిజర్వాయర్ పనులు చేపట్టి పూర్తి చేయాలని ఎమ్మెల్యే కోరారు. సుల్తానాబాద్ లో మంజూరు చేసిన భూమిలో ఐటి టవర్ నిర్మాణం చేపట్టాలని కోరారు. పెద్దపల్లి నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు ప్రతిపాదనలు సైతం పరిశీలించాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్, రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ , అదనపు కలెక్టర్ లు జే.అరుణ జి.వి. శ్యామ్ ప్రసాద్ లాల్, ఆర్డిఓలు బి.గంగయ్య, వి.హనుమా నాయక్, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App