అనంతగిరి ఫిబ్రవరి 18, (త్రినేత్రం న్యూస్): అనంతగిరి మండలం, కాశీపట్నం పంచాయతీ పరిధిలోని పందిరి మామిడి వలస గ్రామంలో సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో గిరిజన కుటుంబం సర్వం కోల్పోయింది. ఆదిమ జాతికి చెందిన గదభ తెగకు చెందిన తామరపల్లి అప్పారావు పూరి ఇల్లు పూర్తిగా అగ్ని ఆహుతికి బూడిదైంది.
ఈ ప్రమాదంలో తులం బంగారం, ఇల్లు నిర్మాణానికి దాచుకున్న రూ.50,000 నగదు, 50 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు తదితర సామగ్రి పూర్తిగా కాలిపోయినట్లు గ్రామస్తులు తెలిపారు.
ఈ ఘటనపై వివిధ పత్రికలలో కథనాలు వెలువడడంతో స్పందించిన అనంతగిరి మండలం ఎమ్మార్వో ఆదేశాల మేరకు స్థానిక అధికారులు, ప్రజాప్రతినిధులు సంఘటితంగా గ్రామాన్ని సందర్శించారు. కాశీపట్నం పంచాయతీ విఆర్ఓ ఎల్.బి. అనిల్, వీఆర్ఏలు సోడిశెట్టి సన్యాసిరావు, దొండపర్తి రవి, గిరిజన సంఘం మండల కార్యదర్శి కె. సింగులు, పంచాయతీ కార్యదర్శి కె. రామశంకర్, సూపర్ సర్పంచ్ బాలు, ఇంజనీర్ అసిస్టెంట్ నగేష్ బృందం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, పరిస్థితిని పరిశీలించారు.
ఈ సందర్భంగా సూపర్ సర్పంచ్ బాలు తన వంతు సహాయంగా 30 కేజీల బియ్యం, నిత్యవసర సరుకులు, కూరగాయలను బాధిత కుటుంబానికి అందజేశారు. అలాగే విఆర్ఓ ఎల్.బి. అనిల్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, నష్టపోయిన వివరాలను నమోదు చేసి పంచనామ నివేదికను సంబంధిత ఉన్నతాధికారులకు సమర్పించారు. ప్రభుత్వం నుంచి అందవలసిన సహకారాలు త్వరగా బాధిత కుటుంబానికి అందేలా తాను పూర్తి సహకారం అందిస్తానని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాదల సోనియా, తామరపల్లి సూర్యనారాయణ, తామరపల్లి రంగబాబు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


