
Trinethram News : బేతంచెర్ల, నంద్యాల జిల్లా: బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నంద్యాల జిల్లా ప్యాపిలి మండలం రాచెర్లలో ఎస్.ఐగా విధులు నిర్వహిస్తున్న వెంకటరమణ మృతి చెందడం పట్ల ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హైదరాబాద్ నుండి అనంతపురం వెళ్తుండగా చోటుచేసుకున్న ప్రమాదంలో ఎస్సై వెంకటరమణను కోల్పోవడం చాలా బాధాకరమన్నారు. ఎస్ఐ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయనతోపాటు కుటుంబ సభ్యులు మరణించడం మరింత శోచనీయం అన్నారు. ప్రమాదంలో తీవ్ర గాయాలతో మహబూబ్ నగర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వెంకటరమణ కుమార్తె అనూషకు మెరుగైన వైద్య సదుపాయాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఎస్.ఐ వెంకటరమణ లేని లోటును ఆయన కుటుంబ సభ్యులకు తట్టుకునే గుండె ధైర్యం భగవంతుడు ప్రసాదించాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
