వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: దరూర్ మండలం. రెవెన్యూ గ్రామసభల ద్వారా ఆర్జీలను స్వీకరించి నూతన చట్టం ప్రకారం భూ సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారము ధరూర్ మండలం కేరెల్లి గ్రామం, కుకింద గ్రామం లో ఏర్పాటు చేసిన భూ భారతి రైతు సదస్సు లల్లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా రైతుల నుండి స్వీకరించిన దరఖాస్తు లను పరిశీలించారు. రైతులు భూ భారతి రెవెన్యూ సదస్సుల్లో ఉచితంగా దరఖాస్తులు సమర్పించవచ్చు. జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ భూ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నట్లు, ప్రజలు ఈ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా భూభారతి చట్టం అమలులో భూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లా నుండి దరూర్ మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన నేపథ్యంలో, భూ సమస్యలు ఉన్నవారు రెవెన్యూ సదస్సులో పాల్గొనాలని, దరఖాస్తులు స్వీకరించి నూతన చట్టం ప్రభుత్వ ఆదేశాల ప్రకారం భూ సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు,
గతంలో ప్రజలు తహసీల్దార్,ఆర్డీఓ లేదా కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లాల్సి వచ్చేదని, కానీ ఇప్పుడు అధికారులు స్వయంగా గ్రామాలకే వచ్చి ప్రజల నుండి దరఖాస్తు లను స్వీకరిస్తున్నామని అన్నారు.ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలులోకి తెచ్చిన భూభారతి చట్టం కింద రైతులు, ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన జరిపిన మీదట, క్షేత్రస్థాయిలో సమగ్ర విచారణ చేయాలని కలెక్టర్ రెవెన్యూ బృందాలను ఆదేశించారు. భూ భారతి పైలెట్ ప్రాతిపాదికన వికారాబాద్ జిల్లా ధరూర్ మండలంలోని గ్రామాలలో నిర్వహించిన రైతు సదస్సుల సందర్భంగా వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వ మార్గదర్శకాలను తు.చ తప్పకుండా పాటిస్తూ, నూతన ఆర్ఓఆర్ చట్టంలో పొందుపర్చిన నిబంధనలకు అనుగుణంగా పరిష్కరించాల్సి ఉంటుందని అన్నారు.
రెవెన్యూ అధికారులు, సిబ్బందితో కలెక్టర్ సమావేశమై భూభారతి దరఖాస్తుల పరిశీలన, విచారణ అంశాలపై మార్గనిర్దేశం చేశారు. రెవెన్యూ గ్రామాలలో నిర్వహించిన సదస్సుల సందర్భంగావచ్చిన దరఖాస్తు లను పరిశీలించారు. వీటిని క్షుణ్ణంగా పరిశీలించి, పక్కాగా ఫీల్డ్ వెరిఫికేషన్ నిర్వహించాలని, మొక్కుబడిగా కాకుండా ప్రతి అంశాన్ని ఎంతో జాగ్రత్తగా, సమగ్రంగా పరిశీలించాలని హితవు పలికారు. ప్రభుత్వ మార్గదర్శకాలు, భూభారతిలోని నిబంధనలపై పరిపూర్ణమైన అవగాహనను కలిగి ఉన్నప్పుడే, తప్పిదాలకు తావులేకుండా దరఖాస్తుల పరిశీలన, విచారణ ప్రక్రియలను నిర్వహించగల్గుతారని అన్నారు. ముందుగా డెస్క్ వర్క్ ద్వారా రెవెన్యూ రికార్డులతో దరఖాస్తులో వివరాలను సమగ్రంగా పరిశీలన చేసుకోవాలని, అనంతరం క్షేత్రస్థాయికి వెళ్లి నిబంధనలకు అనుగుణంగా విచారణ జరపాలన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భూభారతి చట్టాన్ని ప్రవేశపెట్టినందున ఎలాంటి ఆరోపణలు, విమర్శలకు తావు లేకుండా, విచారణ ప్రక్రియను పూర్తి నిబద్ధత, నిజాయితీగా నిర్వహించాలని సూచించారు.
అందులోనూ పైలట్ ప్రాతిపదికన నిర్వహించిన రెవెన్యూ సదస్సులు కావడం వల్ల అందరి దృష్టి కేంద్రీకృతం అయి ఉంటుందని, ఏ చిన్న అవకతవకలకు తావు కల్పించినా ప్రభుత్వ యంత్రాంగానికి, రెవెన్యూ వ్యవస్థకే చెడ్డ పేరు వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఎలాంటి ఒత్తిళ్లు, ప్రలోభాలకు తలొగ్గకుండా భూభారతి దరఖాస్తుల విచారణలో పూర్తి పారదర్శకంగా వ్యవహరిస్తూ, భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ప్రభుత్వ సంకల్పం నెరవేరేలా రెవెన్యూ అధికారులు, సిబ్బంది అందరూ అంకిత భావంతో విధులు నిర్వర్తించాలని కలెక్టర్ హితవు పలికారు. కావాలని తప్పిదాలకు తావు కల్పిస్తే, బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు. భూభారతి చట్టంలో అప్పీల్ వ్యవస్థను అమలు చేస్తున్నందున, ప్రతి దరఖాస్తును ఎంతో జాగ్రత్తగా పరిష్కరించాల్సి ఉంటుందని, దరఖాస్తుదారుడు తిరిగి అప్పీలుకు వెళ్లే పరిస్థితి ఉత్పన్నం కాకుండా నిబంధనలు, మార్గదర్శకాలకు అనుగుణంగా విచారణ జరిపి వాస్తవ పరిస్థితులతో కూడిన అభిప్రాయాలను నివేదికలో పేర్కొనాలని కలెక్టర్ సూచించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


