Trinethram News : ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అంగన్వాడీలు నిరవధిక దీక్షలు చేపట్టనున్నారు. విజయవాడ లోని ధర్నాచౌక్ లో ఈ ఆందోళనలు జరగనున్నాయని.. ఏపీ అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఐకాస నేతలు వెల్లడించారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. సమ్మె చేస్తున్న తమపై ఎస్మా ప్రయోగించి బెదిరించడం దారుణమని ఐకాస నేత పద్మ మండిపడ్డారు. అంగన్వాడీలకు సీఎం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని కోరుతూ గతేడాది డిసెంబరు 12 నుంచి సమ్మె చేస్తున్నారు. ఈ క్రమంలోనే విజయవాడ ధర్నాచౌక్లోనే అంగన్వాడీ కార్యకర్తలు.. సంక్రాంతి పండుగ నిర్వహించి ఆందోళన చేశారు. పిండి వంటలు, చక్కెరపొంగలి, ఇతర వంటలు రోడ్డుపైనే వండుకున్నారు. ఇక డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరంలో ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ అంగన్వాడీలు ప్రభలతో నిరసన వ్యక్తం చేశారు.
కాగా మరోవైపు అనంతపురం కలెక్టరేట్ ఎదుట అంగన్వాడీల నిరసన శిబిరానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. టెంటు కాలిపోతుండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే మంటలు ఆర్పివేశారు. రోజూ దీక్షల్లో కూర్చున్న కార్యకర్తలు అక్కడే నిద్రపోయేవారని.. ఒకవేళ వారు నిద్రిస్తున్న సమయంలో నిప్పు పెట్టి ఉంటే పరిస్థితేంటని అంగన్వాడీలు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.