Collector Ila Tripathi : డీ ఆర్ సి కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్

TRINETHRAM NEWS

ఎలాంటి తప్పులకు అవకాశం లేకుండా మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలను నిర్వహించాలి. —జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి .

దేవరకొండ డివిజన్ డిసెంబర్ 16 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గం లో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికల సందర్బంగా ఏర్పాటు చేసిన డిఆర్సి కేంద్రాన్ని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సందర్శించారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని,పోలింగ్ సిబ్బంది సకాలంలో వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలను చేరుకొని అవసరమైన ఏర్పాట్లు ముందే చేసుకోవాలని కలెక్టర్ చెప్పారు. ఎన్నికలలో తప్పు చేస్తే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి పొరపాట్లు జరగకూడదని, ముఖ్యంగా పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ కంపార్ట్మెంట్ కిటికీలకు దూరంగా ఏర్పాటు చేయాలని, అలాగే సరైన విధంగా వెలుతురు ఉండేలా చూసుకోవాలన్నారు.
పోలింగ్ బూత్ లో ముగ్గురు కంటే మించి ఓటర్లు ఉండకూడదని తెలిపారు. పోలింగ్ పూర్తి అయిన తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు తప్పనిసరిగా ఓట్ల లెక్కింపు ప్రారంభించాలని, లెక్కింపు పూర్తయిన తర్వాత ఎన్నికల ఫలితాలను వెంటనే ప్రకటించాలన్నారు. పోలైన బ్యాలెట్ల తో పాటు, పోల్ కానీ బ్యాలెట్లు సైతం పూర్తిగా కాపాడే బాధ్యత స్టేజ్ -2 ఆర్ ఓ లపై ఉందన్నారు. ఈ సందర్భంగా ఆమె టెండర్ ఓట్ల ప్రాముఖ్యతను, టెండర్ ఓట్ల ప్రక్రియ విధానాన్ని తెలియజేశారు. పోలింగ్ కేంద్రం లే-అవుట్ పరిశీలించిన తర్వాత అతిపెద్ద రెండవ గదిని కౌంటింగ్ ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ సందర్భంగా ఏజెంట్లకు కౌంటింగ్ టేబుల్ కి మధ్యలో బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని చెప్పారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడుతూ సాధ్యమైనంత త్వరగా కౌంటింగ్ పూర్తిచేయాలని, కౌంటింగ్ లో జాప్యం జరిగితే చీకటి పడి తప్పులు జరిగేందుకు ఆస్కారం ఉందని,అందువల్ల కౌంటింగ్ కు సాధ్యమైనన్ని ఎక్కువ టేబుళ్లు ఏర్పాటు చేయాలని, అలాగే ప్రతి పోలింగ్ కేంద్రంలో ప్రహరీ లేకుంటే తాత్కాలిక కంచె వేసుకోవాలని, సాధ్యమైనంత త్వరగా ఎన్నికలను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.

రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ పోలింగ్, కౌంటింగ్ లపై సూచనలు చేశారు. దేవరకొండ ఆర్డీవో రమణారెడ్డి, డిపిఓ వెంకయ్య, జెడ్పిసిఈఓ శ్రీనివాస రావు, ఇతర అధికారులు ఉన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

District Collector visited the DRC center

You cannot copy content of this page

Scroll to Top