భూసేకరణవల్లే రైల్వే లేన్ నిర్మాణ పనుల్లో జాప్యం
రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణను వేగవంతం చేయాలని కోరుతున్నా
2027 నాటికి కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లేన్ పనులు పూర్తి
మార్చి నాటికి అందుబాటులోకి ఆధునాతన కరీంనగర్ రైల్వే స్టేషన్
రూ.60 కోట్లతో అతి త్వరలో కొత్తపల్లి స్టేషన్ నిర్మాణం పూర్తి
3 నెలల్లో ఉప్పల్ ఆర్వోబీని అందుబాటులోకి తెస్తాం
Trinethram News : Telangana : రాష్ట్రంలో చేపట్టిన రైల్వే లేన్ నిర్మాణ పనులు జాప్యం కావడానికి ప్రధాన కారణం భూసేకరణ సమస్యేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో ఆశించిన స్థాయిలో సహకరించడం లేదన్నారు. కేంద్రం ఎప్పటికప్పుడు నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ భూసేకరణ సమస్య పరిష్కారం కాకపోవడంతో చాలా చోట్ల రైల్వే లేన్, ఆర్వోబీల నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతోందన్నారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే నిర్మాణ పనులను 2027 నాటికి పూర్తి చేయనున్నట్లు చెప్పారు. అట్లాగే వచ్చే మార్చి నాటికి కరీంనగర్ రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు పూర్తవుతాయని తెలిపారు. 60 కోట్లతో చేపట్టిన కొత్తపల్లి రైల్వే స్టేషన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయన్నారు. జమ్మికుంట ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణం అనేక కారణాలవల్ల జాప్యం జరిగిందన్నారు. రాబోయే 3 నెలల్లో ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణ పనులను పూర్తి చేస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు చెప్పారు.
ఈరోజు కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కరీంనగర్ రైల్వే స్టేషన్, కొత్తపల్లి రైల్వే స్టేషన్ ను సందర్శించారు. పనుల కొనసాగుతున్న తీరును పరిశీలించారు. తీగలగుట్టపల్లి ఆర్వోబీని సందర్శించారు. అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అంతకుముందు మీడియాతో మాట్లాడారు. ఏమన్నారంటే….
కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టు నిర్మాణ పనుల పురోగతిపై ఈరోజు సంబంధిత అధికారులతో సమీక్షించాను. అందులో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ ను, తీగలగుట్టపల్లి ఆర్వోబీ, కొత్తపల్లి స్టేషన్ నిర్మాణ పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నా. పనులను స్పీడప్ చేయాలని కోరిన. అట్లాగే కరీంనగర్ రైల్వే స్టేషన్, తీగలగుట్టపల్లి ఆర్వోబీ, కొత్తపల్లి స్టేషన్ ను విజిట్ చేయడం జరిగింది.
మీకు తెలుసు. ‘అమృత్ భారత్’ పథకంలో భాగంగా ప్రియతమ ప్రధాని నరేంద్రమోదీవ గారు దేశవ్యాప్తంగా 25 వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఏకకాలంలో 1350 రైల్వే స్టేషన్లను ఆధునీకరించి ఆదర్శ స్టేషన్లుగా తీర్చిదిద్దాలని సంకల్పించారు. ఇదొక చరిత్ర. ప్రపంచంలోనే ఒకేసారి ఇన్ని స్టేషన్లను ఆధునీకరిస్తున్న చరిత్ర ఏ దేశానికి లేదు. మన రాష్ట్రం విషయానికొస్తే 40 స్టేషన్లను డెవలెప్ చేస్తున్నం. ఆ జాబితాలో మన కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎంపికైంది. 2023 ఆగస్టులో అభివ్రుద్ధి పనులు స్టార్ట్ చేసినం. మొత్తం 44 కోట్ల 16 లక్షల రూపాయల వ్యయం అంచనా వ్యయంతో పనులు చేపట్టినం.
సరిగ్గా 6 నెలల క్రితం వరకు కరీంనగర్ రైల్వే స్టేషన్ ఎట్లుండేదో మీకు తెలుసు. ప్రయాణీకులకు కనీస సౌకర్యాలు కూడా లేకుండే. కానీ మోదీగారి విజన్ పుణ్యమా? అని ఊహించని విధంగా కరీంనగర్ స్టేషన్ అభివ్రుద్ది అవుతోంది. రైల్వే స్టేషన్ భవనాన్ని అప్ గ్రేడ్ చేస్తున్నం. సోలార్ పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నం. ఎస్కలేటర్, లిఫ్ట్ పనులు చకచకా కొనసాగుతున్నాయి. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, కొత్త ప్లాట్‌ఫారాలు పనులు ఇప్పటికే పూర్తయినయ్. రోడ్డు అభివృద్ధి, ప్లాట్‌ఫారం షెల్టర్‌లు, టాయిలెట్ గదుల పునర్నిర్మిస్తున్నం. జెట్ స్పీడ్ తో శరవేగంగా పనులు కొనసాగుతున్నయ్. ముందుగా అనుకున్నట్లుగానే ఈ ఏడాది(2025) మార్చి 31నాటికి అభివ్రుద్ది పనులు పూర్తి చేసి కరీంనగర్ రైల్వే స్టేషన్ ను ఆదర్శ స్టేషన్ గా అందుబాటులోకి తీసుకురాబోతున్నం. కష్టపడి పనిచేస్తున్న రైల్వే సిబ్బందిని మనస్పూర్తిగా అభినందిస్తున్నా…
అట్లాగే సేతు బంధన్ స్కీం కింద 154 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణ పనులను కూడా పరిశీలించడం జరిగింది. పూర్తిగా కేంద్ర నిధులతోనే ఆర్వోబీని నిర్మిస్తున్నం. అయితే సొమ్మొకడిది, సోకు మరొకరిదన్నట్లుగా అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసిందో, కనీసం ఎంపీగా సమాచారం ఇవ్వకుండా కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేసిన సంగతి కూడా మీకు తెలుసు. ఆ విషయాల్లోకి నేను వెళ్లదలుచుకోలేదు. 2023 జులై 13న కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణానికి భూమి పూజ చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో పనులు కొనసాగలేదు. ఒప్పందం ప్రకారం ఈ ఏడాది జులై నాటికి ఆర్వోబీ నిర్మాణం పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి. కానీ అధికారుల, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతోపాటు గత ప్రభుత్వం నుండి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోవడంవల్ల ఆశించిన స్థాయిలో పనులు కాలేదు. తొందరగా ప్రజలకు ఆర్వోబీని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రత్యేక ద్రుష్టి పెట్టినం. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్ణీత గడువులోగా పనులను పూర్తి చేయాలని అధికారులను కోరడం జరిగింది. ఆర్వోబీ నిర్మాణం సందర్భంగా తీగలగుట్టపల్లి వద్ద రోడ్డు అధ్వాన్నంగా మారి ప్రయాణీకులు తీవ్ర ఇబ్బంది పడుతున్న విషయం నా ద్రుష్టికి వచ్చింది. వెంటనే అధికారులతో మాట్లాడి 36 లక్షల రూపాయలు మంజూరు చేయించి అప్రోచ్ రోడ్డును నిర్మించాలని నిర్ణయించినం. ఈరోజు అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టి భూమిపూజ చేయడం జరిగింది.
ఇగ ఉమ్మడి కరీంనగర్, ఉమ్మడి మెదక్ జిల్లాల ప్రజల చిరకాల స్వప్నమైన కొత్తపల్లి- మనోహరాబాద్ రైల్వే లేన్ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించడం జరిగింది. 2016 జూలై 21న కొత్తపల్లి- మనోహరాబాద్ కొత్త రైల్వే లేన్ కు సంబంధించి మొత్తం 151. 36 కి.మీల మేరకు నిర్మాణ పనులకు కేంద్రం ఆమోదం తెలిపింది. నిజానికి ఆనాడు ప్రాజెక్టు నిర్మాణ అంచనా వ్యయం 1160 కోట్ల 48 లక్షల రూపాయలు. కానీ అనేక కారణాలవల్ల నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఈ విషయం మోదీగారి ద్రుష్టికి, రైల్వే మంత్రి అశ్వీనీ వైష్ణవ్ గార్ల ద్రుష్టికి తీసుకెళ్లిన వెంటనే వారు సానుకూలంగా స్పందించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయ్యే వరకు కొత్తవాటిని మంజూరు చేయకూడదని, పెండింగ్ ప్రాజెక్టులకు అవసరమైన నిధులన్నీ కేటాయించేందుకు సిద్ధమైనరు. అందులో భాగంగా కొత్తపల్లి మనోహరాబాద్ రైల్వే లేన్ నిర్మాణ పనులు పూర్తి కావాలంటే సవరించిన లెక్కల ప్రకారం…మొత్తం 2 వేల 780 కోట్ల 78 లక్షలు ఖర్చవుతుందని రైల్వే అధికారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 14 వందల 44 కోట్ల 17 లక్షల రూపాయలు ఖర్చు చేసినం. ఒప్పందం ప్రకారం మొత్తం ప్రాజెక్టు వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వం మూడో వంతు వాటా చెల్లించాల్సి ఉంది.
మొత్తం 151. 36 కి.మీల మేరకు పనులకుగాను ఇప్పటి వరకు 76.135 కిలోమీటర్ల మేరకు పనులు పూర్తయిన్. ఇంకా 75 కి.మీలకుపైగా నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. ఈ బడ్జెట్ లో(2024-25) 350 కోట్ల రూపాయలు మంజూరు చేసినం. ఇప్పటి వరకు 262 కోట్ల 93 లక్షల రూపాయలు ఖర్చు చేసినం. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి సిద్దిపేట, సిరిసిల్ల జిల్లాల పరిధిలోని మరో 30 కి.మీలకు పైగా రైల్వే నిర్మాణ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నం.
ఒప్పందం ప్రకారం రైల్వే లేన్ నిర్మాణానికి అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వమే సేకరించి ఇవ్వాలి. కానీ భూసేకరణ విషయంలోనే చాలా జాప్యం జరగడంతో రైల్వే లేన్ నిర్మాణ పనులు ఆశించిన స్థాయిలో జరగలేదు. ప్రస్తుతానికి భూసేకరణ సమస్య 90 శాతం మేరకు పరిష్కారమైంది. మొత్తం 1145.627 హెక్టార్ల (సుమారు 2వేల 830 ఎకరాలు) భూమిని సేకరించాల్సి ఉండగా 199 ఎకరాలు మినహా మిగిలిన భూసేకరణ పూర్తయ్యింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 37.5 ఎకరాల (15.211 హెక్టార్లు) ఫారెస్ట్ భూమిని మళ్లించాల్సి ఉంది. ఆ సమస్య కూడా త్వరలోనే పరిష్కారమవుతుందని భావిస్తున్నం.
అట్లాగే ఈ ఏడాది డిసెంబర్ నాటికి వేములవాడ నుండి కొత్తపల్లి వరకు 31.06 కి.మీల మేరకు నిర్మాణ పనులను, వచ్చే ఏడాది(2026) మార్చి నాటికి సిరిసిల్ల, వేములవాడ పరిధిలో 10.7కి.మీల పనులను పూర్తి చేయాలని అధికారులను కోరడం జరిగింది. సిద్దిపేట-సిరిసిల్ల (76.13 కి.మీ నుండి 106.8 కి.మీ) వరకు పనుల నిర్మాణానికి సంబంధించి టెండర్ ప్రక్రియ పూర్తయింది. పనులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది డిసెంబర్ నాటికి సిద్దిపేట-సిరిసిల్ల కొత్త బ్రాడ్ గేజ్ పనులను ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
కొత్తపల్లి స్టేషన్ వద్ద సరుకు రవాణా సౌకర్యాలతో కొత్తపల్లి జంక్షన్ స్టేషన్ గా అభివ్రుద్ధి చేయాలని నిర్ణయించారు. టెండర్లు కేటాయించారు. పనులు కొనసాగుతున్నాయి. మార్చినాటికి ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. సిరిసిల్ల-వేములవాడ (106.8 నుండి 111.5 కి.మీ వరకు) పనులు EPC (ఇంజనీరింగ్, ప్రోక్యూర్ మెంట్, కన్ స్ట్రక్షన్) దశలో ఉన్నాయి. అట్లాగే మానేరు నదిపై ముఖ్యమైన వంతెనను నిర్మించబోతున్నం. ఈనెలాఖరులోగా EPC టెండర్ ప్రక్రియను ప్రారంభించబోతున్నం. ఈ బ్రిడ్జి చాలా కీలకం. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ఈ మార్గంలో నిరంతరం రైలు ప్రయాణం సులభమవుతుంది.
ఏదేమైనప్పటికీ 2027 నాటికి కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే లేన్ నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నం. ఈ రైల్వే లేన్ అందుబాటులోకి వస్తే… తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, సిద్దిపేట, రాజన్న సరిసిల్ల, కరీంనగర్ జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలు అభివ్రుద్ధి చెందుతాయి. ఈ ప్రాంత ప్రజలకు రైల్వే ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. అట్లాగే సికింద్రాబాద్ – ఖాజీపేట రైల్వే లేన్ లో ఏమైనా అవాంతరాలు, ప్రమాదాలు ఏర్పడితే… కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వే లేన్ ద్వారా న్యూఢిల్లీకి వెళ్లేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు మెరుగవుతాయి.
జమ్మికుంట మండలం ఉప్పల్ వద్ద నిర్మిస్తున్న ఆర్వోబీ నిర్మాణంపైనా సమీక్షించడం జరిగింది. ఎందుకు జాప్యం జరుగుతోంది? కారణాలేంటని అధికారులను అడిగి తెలుసుకున్న. వాస్తవానికి 2015-16 బడ్జెట్ లోనే ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణానికి కేంద్రం ఆమోదం లభించింది. మొత్తం 54 కోట్ల 15 లక్షల అంచనా వ్యయం అవుతుందని అంచనా వేశారు.
ఒప్పందం ప్రకారం… రైల్వే శాఖ 23 కోట్ల 60 లక్షల రూపాయలు, రాష్ట్ర ప్రభుత్వం 30 కోట్ల 54 లక్షల రూపాయలు భరించాల్సి ఉంది. కానీ అనేక కారణాలవల్ల పనుల్లో తీవ్ర జాప్యం జరిగింది. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఆశించిన సహకారం లభించలేదు. ప్రస్తుతం సవరించిన అంచనాల ప్రకారం ఉప్పల్ ఆర్వోబీ నిర్మాణ వ్యయం 72 కోట్ల 54 లక్షలు. ఒప్పందం ప్రకారం… రాష్ట్ర ప్రభుత్వం 57 కోట్ల 13 లక్షలు, రైల్వే వాటా 15 కోట్ల 41 లక్షలు భరించాలి. ప్రస్తుతం అప్రోచ్ రోడ్డు పనులు కూడా పూర్తయినయ్. చివరి దశలో పనులు కొనసాగుతున్నయ్. వచ్చేనెలాఖరుకల్లా నిర్మాణ పనులను పూర్తి చేసి ఉప్పల్ ఆర్వోబీని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App