TRINETHRAM NEWS

Trinethram News : శేరిలింగంపల్లి నియోజకవర్గం 124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోని ఎల్లమ్మబండలో గల తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త.. తెలంగాణ ఆత్మగౌరవాన్ని తట్టిలేపిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ విగ్రహాన్ని ఒక గుర్తు తెలియని వ్యక్తి ధ్వంసం చేయడం జరిగింది. మద్యం మత్తులో ఊగుతూ, పిచ్చి పిచ్చి గెంతులు వేస్తూ, పెద్ద బండరాయితో జయశంకర్ విగ్రహాన్ని పగలగొట్టి పైశాచిక ఆనందం పొందాడు. ఈ విషాదకరమైన సంఘటనను ఖండిస్తూ డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితులను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని పగలగొట్టటం బాధాకరమైన విషయం అని, ఇటువంటి విషాదకరమైన సంఘటన జరిగినందుకు చింతిస్తున్నమని అన్నారు.

బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదినర ఏళ్ల పాలనలో చిన్న చిన్న పొరపాట్లు కూడా జరగకుండా జాగ్రత్త పడ్డామని, విగ్రహాన్ని పగలగిట్టిన వ్యక్తి ఎవరైనా సరే కఠినంగా శిక్షించాలని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో పార్టీలకు అతితంతంగా మహాత్మాగాంధీ, ఇందిర గాంధీ, ఎన్టీఆర్ వంటి ఎంతోమంది మహానుభావుల విగ్రహాలను ఆల్విన్ కాలనీ డివిజన్ లో ప్రతిష్టించడం జరిగింది అని గుర్తుచేశారు. పోలీస్ శాఖ వారు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా పారదర్శకంగా దర్యాప్తు చేసి నిందుతుణ్ణి విచారించాలని స్థానిక పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది అన్నారు. జరిగిన దురదృష్టకరమైన సంఘటనకు తెలంగాణ ప్రభుత్వం నైతిక బాధ్యత వహించి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహాన్ని యధాస్థానంలో పునఃప్రతిష్టించి తెలంగాణ ఆత్మగౌరవాన్ని కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రొఫెసర్ జయశంకర్ అభిమానులు మరియు కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.