Collector’s Whirlwind Tour : అనంతగిరి మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
అనంతగిరి, ఫిబ్రవరి 27, (త్రినేత్రం న్యూస్) : అనంతగిరి మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ గురువారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో చేపడుతున్న రోడ్డు నిర్మాణ పనులను ఆయన ప్రత్యక్షంగా తనిఖీ చేసి అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.
మండలంలోని పెద్దబిడ్డ పంచాయతీ పరిధిలో డముకు , నిమ్మలపాడు నుండి పెద్దబిడ్డ వరకు 2.10 కిలోమీటర్ల తారు రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ప్రస్తుతం వెట్ మిక్స్ లేయర్ వరకు పనులు పూర్తై రోలింగ్ దశలో ఉన్నాయని అధికారులు తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేసి తారు రోడ్డు వేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అదే విధంగా గుమ్మ పంచాయతీ పరిధిలో గుమ్మ నుండి చీడివలస వరకు, నిమ్మవూట, మిర్తుతుంగడ, మద్దిపాడు, బూరుగులపాడు, కరకవలస, బూసిపాడు, పొర్లువలస గ్రామాల మీదుగా నిర్మాణంలో ఉన్న 11 కిలోమీటర్ల రోడ్డు పనులను పరిశీలించారు. అందులో కొంత భాగం వెట్ మిక్స్ లేయర్, 6 కిలోమీటర్ల వరకు జీఎస్‌బీ లేయర్ పూర్తి కావడంతో రోలింగ్ పనులు కొనసాగుతున్నాయి. పనులను త్వరితగతిన పూర్తి చేసి తారు వేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రోడ్ల లేయర్ల మందం, వెడల్పు వంటి అంశాలను స్వయంగా తనిఖీ చేసిన కలెక్టర్, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. భారీ వర్షాల సమయంలో కల్వర్టుల అప్రోచ్ ప్రాంతాల్లో రోడ్లు దెబ్బతినకుండా సీసీ ర్యాంపులు, స్టోన్ ప్యాకింగ్ వంటి రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ రహదారుల ద్వారా పరిసర గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, నూతన సెల్ టవర్ నిర్మాణ పనులు సులభతరం అవుతాయని గ్రామస్తులతో చర్చించారు.
అనంతరం అనంతగిరి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఓపీ రిజిస్టర్, సిబ్బంది హాజరు పట్టికలను పరిశీలించారు. అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. మండలంలోని చెరుకుబిడ్డ గ్రామంలోని ఎంపీపీ పాఠశాలను కూడా సందర్శించిన కలెక్టర్, విద్యార్థులతో ముచ్చటించి బోధన విధానంపై వివరాలు తెలుసుకున్నారు.
ఈ పర్యటనలో గిరిజన సంక్షేమ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె. వేణుగోపాల్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టి. అభిషేక్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. గణేష్ మరియు మండల స్థాయి అధికారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

