ప్రభుత్వ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత మంత్రులదే : సీఎం చంద్రబాబు
Trinethram News : Andhra Pradesh : మంత్రివర్గ సమావేశం అనంతరం మంత్రులతో పాలనా అంశాలపై సీఎం చంద్రబాబు కొద్దిసేపు ముచ్చటించారు. కొత్త ఏడాదిలో అమలు చేయాల్సిన వివిధ పథకాలపైనా చర్చించారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘తల్లికి వందనం’ కార్యక్రమాన్ని అమలు చేసే అంశంపై చర్చ జరిగింది. రైతులకు, మత్స్యకారులకు అందించే ఆర్థిక సాయాన్ని రూ.20,000ను ఒకేసారి చెల్లించే అంశంపై చర్చించారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లే బాధ్యత మంత్రులపై ఉందని సీఎం స్పష్టం చేశారు. రెవెన్యూ సదస్సులు జరుగుతున్న తీరుతెన్నులు, జలవనరులు, ఆర్ధిక ఇబ్బందులుపై సుదీర్ఘ చర్చ జరిగింది. వివిధ సమస్యలపై మంత్రులతో సీఎం చర్చించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రెవెన్యూ, ఫైనాన్స్, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రులతో ఉపసంఘం ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు.
గోదావరి – బనకచర్ల అనుసంధానంపై మంత్రులకు సీఎం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కొత్త ప్రాజెక్టుకు ఎలా నిర్మించాలి, నిధుల సమీకరణపై చర్చించారు. కుప్పం, చిత్తూరుకు అదనంగా నీరు ఇచ్చేందుకు చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజవాయర్, యోగి వేమన నుంచి హంద్రీనీవా లింక్ ద్వారా ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని నిర్ణయించారు. గోదావరి – బనకచర్ల ప్రాజెక్టు నదుల అనుసంధానం వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాల కింద నిధుల ఇవ్వాలని కేంద్రాన్ని కోరామని సీఎం తెలిపారు. పట్టిసీమ వల్ల రాయలసీమకు ప్రత్యక్షంగా, పరోక్షంగా జరిగిన లబ్దిపై ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు.
రాష్ట్ర ఆర్ధిక ఇబ్బందులపై ఫైనాన్స్ శాఖ ప్రెజెంటేషన్ ఇచ్చింది. ఎన్ని ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అన్ని పథకాలు అమలు చేసి తీరుదామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. బకాయిలు ఎన్ని ఉన్నాయని డిప్యూడీ సీఎం పవన్ కల్యాణ్ ఆరా తీశారు. రూ.1,30,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని మంత్రి పయ్యావుల కేశవ్ వివరించారు.
ఈ నెల 8వ తేదీన విశాఖలో ప్రధాని పర్యటనను విజయవంతం చేసేందుకు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ వేయాలని నిర్ణయించారు. ప్రధాని రోడ్‌షో కూడా నిర్వహించే నేపథ్యంలో దాన్ని విజయవంతం చేయాలని నిర్ణయించారు. విశాఖలో ప్రధాని మోదీ ఎన్టీటీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు, నక్కపల్లి బల్క్ డ్రగ్ పార్క్, విశాఖ రైల్వే జోన్, పారిశ్రామిక నోడ్లకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీతో కలిసి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌లు రోడ్ షో నిర్వహించనున్నారు. విశాఖ సిద్ధి వినాయక ఆలయం నుంచి సభ వేదిక వరకూ జరిగే రోడ్‌షో కోసం 3 పార్టీలతో సమన్వయ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App