TRINETHRAM NEWS

Christmas: తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా క్రిస్మస్‌ సంబరాలు.. ప్రార్థనా మందిరాల్లో ప్రత్యేక ప్రార్ధనలు

తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్‌ సంబరాలు అంబరాన్నంటాయి. ప్రార్థనా మందిరాలన్నీ కళకళలాడుతూ కనిపిస్తున్నాయి. క్రైస్తవ సోదరులు ఆనందోత్సాహాలతో పండుగ జరుపుకుంటున్నారు. ఏసుక్రీస్తు జన్మించిన పర్వదినాన్ని పురస్కరించుకుని తెలుగు రాష్ట్రాల్లో చర్చిలు సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. చర్చిలను రంగురంగుల విద్యుత్‌ దీపాలతో అందంగా అలంకరించారు. ఆసియా ఖండంలోనే రెండో అతిపెద్దదైన మెదక్‌ చర్చ్‌లో ఘనంగా ఏర్పాట్లు చేశారు. 100వ పడిలోకి అడుగిడుతున్న సందర్భంగా ఏడాదిపాటు సంబరాలు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ చర్చ్‌ నిర్మాణానికి అప్పట్లో పదేళ్ల సమయం పట్టింది. 14 లక్షల రూపాయల ఖర్చుతో నిర్మించిన ఈ చర్చ్‌ 1924లో ప్రారంభమైంది.

ఈ చర్చ్‌ను చూసేందుకు దేశ విదేశాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ జరిగే క్రిస్మస్ వేడుకల్లో స్థానికులే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. జనవరి ఒకటి వరకూ భక్తుల తాకిడి తీవ్రంగా ఉంటుందని, అయినా ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లూ చేశామన్నారు నిర్వాహకులు. హైదరాబాద్‌, సికింద్రాబాద్‌లోని చర్చిలన్నింటినీ సుందరంగా అలంకరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పర్వదిన వేడుకల్లో పాల్గొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోనూ క్రిస్మస్‌ పండుగ సందడి నెలకొంది. చర్చిల్లో క్రీస్తు ఆరాధన, పవిత్ర బోధనలు కొనసాగుతున్నాయి. ప్రత్యేక ప్రార్ధనలు కూడా చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఇడుపులపాయ ప్రేయర్ హాల్ లో క్రిస్మస్ ప్రార్ధనల్లో పాల్గొన్నారు. వైఎస్ భారతి, వైఎస్ విజయమ్మ ఇతర కుటుంబ సభ్యులు కూడా ప్రార్థనలు చేశారు.