TRINETHRAM NEWS

Trinethram News : దేశంలో ఎలక్ట్రిక్‌ వాహనాల అమ్మకాలు జోరుగా కొనసాగుతున్నాయి. ఆధునిక కాలానికి అనుగుణంగా అనేక ఫీచర్లు, ప్రత్యేకతలతో వీటిని వివిధ కంపెనీలు ప్రతిష్టాత్మంగా తయారు చేస్తున్నాయి. పెట్రోలు వాహనాల మాదిరిగానే స్పీడ్‌, లుక్‌తో అదరగొడుతున్నాయి. వాటికి అనుగుణంగానే అమ్మకాలు కూడా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. పెరుగుతున్న పెట్రోలు ధరల నుంచి తప్పించుకోవడానికి, పర్యావరణ పరిరక్షణకు ఈ వాహనాల వినియోగం పెరగడం అవసరమని చెప్పవచ్చు. ఒక్కసారి చార్జింగ్‌ చేసుకుంటే సుమారు ఎనభై నుంచి వంద కిలోమీటర్ల దూరం ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణం చేయవచ్చు. వీటి బరువు కూడా తక్కువగా ఉండడంతో బ్యాలెన్స్‌ చేయడం చాలా సులభతరం అవుతుండటంతో మహిళలకు ఉపయుక్తంగా మారతున్నాయి. మరోవైపు వీటి తయారీ, కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం ఫేమ్‌-2 సబ్సిడీలు కూడా అందిస్తోంది. ఈ క్రమంలో ఈ వాహనాల వినియోగం ఊపందుకుంది. అయితే ఈ ఫేమ్‌-2 సబ్సిడీలను మార్చి నెలాఖరుకు నిలిపివేయనున్నట్లు పేర్కొంది. అయితే మరో కొత్త ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024ను కేంద్ర ప్రభుత్వం అమలు చేయాలని చూస్తోంది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం..

కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహం..
దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. వివిధ పథకాలు ప్రవేశపెట్టి కొనుగోలుదారులకు ప్రోత్సాహం అందజేస్తుంది. ఆ పథకాలకు రూ.కోట్లలో నిధులు కేటాయించి, వాటిని సబ్సిడీలుగా ఇస్తుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024ను ప్రారంభించింది. దీని ద్వారా సుమారు రూ.500 కోట్లను ఖర్చుచేయనుంది. అయితే ఈ పథకం ఏప్రిల్ ఒకటి నుంచి అమలులోకి వచ్చి, దాదాపు నాలుగు నెలల పాటు కొనసాగుతుంది.

కొత్త పథకంలో సబ్సిడీ వివరాలు..
ఎలక్ట్రిక్ వాహనాల కోనుగోళ్లు, తద్వారా వినియోగాన్ని పెంచడానికి రూపొందించిన ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్లో అనేక రకాల సబ్సిడీలు ప్రకటించారు. దాని ప్రకారం.. పథకం అమలులోకి వచ్చిన నాటి నుంచి నాలుగు నెలల్లో 3,33,387 ద్విచక్ర వాహనాలకు రూ.10 వేలు చొప్పున సబ్సిడీ ఇస్తారు. ఇలా రూ.33,339 కోట్లు ఖర్చు చేయనున్నారు. అలాగే ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల (చిన్న వాహనాలు)కు సంబంధించి ఒక్కో వాహనానికి రూ. 25 వేలు సబ్సిడీ ఉంటుంది. ఇలా 13,590 ఈ-రిక్షాల కోసం రూ. 33.97 కోట్లు కేటాయించారు. అలాగే పెద్ద త్రిచక్ర వాహనాలు అంటే ఎలక్ట్రిక్ ఆటోలకు ప్రోత్సాహకంగా గరిష్టంగా రూ.50 వేలు అందజేస్తారు. దీనికి రూ.126.19 కోట్లు ఖర్చు చేయాలని నిర్ణయించారు. 2024 ఏప్రిల్ నుంచి నాలుగు నెలలు పాటు సబ్సిడీగా రూ.500 కోట్లు ఖర్చు చేయాలని ప్రణాళిక రూపొందించారు.

ఫేమ్‌ పథకానికి పూర్తి కానున్న గడువు.. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగాన్ని ప్రోత్సహించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం గతం నుంచి అనేక పథకాలను అమలు చేస్తోంది. దానిలో భాగంగా ప్రవేశ పెట్టిన ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ స్కీమ్ సెకండ్ ఫేజ్ (ఫేమ్‌ – 2) ఈనెల చివరి (మార్చి 31) వరకూ అమలులో ఉంటుంది. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకూ ఎలక్ట్రిక్ వాహనాలకు సబ్సిడీలు అందించింది. దాని గడువు ముగియనుండడంతో కొత్త పథకానికి రూపకల్పన చేసింది. ఫేమ్ – 2 పథకం పూర్తవగానే, కొత్త ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రమోషన్ స్కీమ్ 2024 ప్రారంభమవుతుంది.

అనేక రాయితీలు..
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెంచడానికి ప్రభుత్వం మొదటగా 2015లో ఫేమ్‌ – 1 పథకాన్ని అమలు చేసింది. అనంతరం ఆ పథకం రెండో దశను 2019 నుంచి మూడేళ్లపాటు అమల్లోకి తీసుకు వచ్చింది. అయితే కోవిడ్-19 మహమ్మారి కారణంగా పడిన ఇబ్బందుల నేపథ్యంలో ప్రజల కోసం ఈ మార్చి 31 వరకు పొడిగించింది. ఫేమ్‌ – 1 పథకానికి బడ్జెట్ రూ. 895 కోట్లు, ఫేమ్‌ – 2 పథకానికి 10,000 కోట్లు కేటాయింపులు చేశారు. అయితే పెండింగ్‌ అప్పులను లెక్కించేందుకు దీన్ని రూ.11,500 కోట్లకు పెంచారు.