ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Anti-drug awareness

Anti-Drug Awareness : అరకులోయ, జూలై 21,( త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లాను గంజాయి సాగు రహిత జిల్లాగా, ఆంధ్రప్రదేశ్‌ను మాదకద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో “ఈగిల్ పల్లెబాట–రచ్చబండ” కార్యక్రమాన్ని అధికారులు విస్తృతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈగిల్ హెడ్‌క్వార్టర్స్ డీఎస్పీ కె. సింగయ్య ఆధ్వర్యంలో ఈగిల్ సిబ్బంది, అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ పోలీసులు సంయుక్తంగా డుంబ్రిగూడ మండలంలోని కిలోగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల, ప్రభుత్వ గిరిజన సంక్షేమ పాఠశాల, కిలోగూడ గ్రామం, అరకు పైనియర్ ప్రాంతాల్లో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా విద్యార్థులు, యువత, గ్రామస్థులు, పర్యాటకులను ఉద్దేశించి అధికారులు మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ తదితర మాదకద్రవ్యాల వినియోగం వల్ల వ్యక్తిగత, కుటుంబ, సామాజిక జీవితాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించారు. ఎన్‌డీపీఎస్ చట్టం–1985 కింద మాదకద్రవ్యాల సాగు, రవాణా, నిల్వ, విక్రయం, వినియోగానికి పాల్పడిన వారిపై కఠినమైన శిక్షలు అమలవుతాయని హెచ్చరించారు.
మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని పేర్కొన్న అధికారులు, గంజాయి సాగు లేదా ఇతర మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే 1972 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో సుమారు 500 మంది విద్యార్థులకు డ్రగ్స్ దుష్పరిణామాలపై అవగాహన కల్పించి, మాదకద్రవ్యాలకు దూరంగా ఉంటామని ప్రతిజ్ఞ చేయించారు. అలాగే గ్రామస్థులు, యువతతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులకు కూడా ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తూ మాదకద్రవ్యాల నిర్మూలనకు సహకరించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఈగిల్ హెడ్‌క్వార్టర్స్ అధికారులు, అల్లూరి జిల్లా డుంబ్రిగూడ పోలీసులు, పాఠశాలల బోధన సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్థులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page