CM Revanth : కేసీఆర్ వల్లే నాకు గుర్తింపు వచ్చింది

TRINETHRAM NEWS
CM Revanth I Gained Recognition Solely Because of KCR

CM Revanth : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల్లే తనకు గుర్తింపు వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ లేకపోతే తాను చేసిన మంచి పనులు ప్రజలకు తెలిసేవి కాదని చెప్పారు. రావణుడి చెడు వల్లే రాముడి గొప్పతనం తెలిసిందని చెప్పుకొచ్చారు. మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన ముఖ్యమంత్రి పలు కీలక అంశాలపై మాట్లాడారు. కేసీఆర్‌ విశ్రాంతి తీసుకొంటున్నారని అందరూ అంటున్నారని.. ఆయన్ను గృహ నిర్బంధం చేశారని తనకు అనుమానంగా ఉందన్నారు.

ఎంపీ లక్ష్మణ్ రాజీనామా చేయాలి..!

దేశంలో నియోజకవర్గాల పునర్విభజనపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఏదేదో మాట్లాడుతున్నారని.. తెలంగాణలో రాష్ట్రపతి పాలన పెడతామని ఆయన అంటున్నారని మండిపడ్డారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పెట్టరా? అంటూ ప్రశ్నించారు. నియోజకవర్గాల పునర్విభజనను 50 శాతం సీట్ల ప్రాతిపదికన చేస్తే దక్షిణ భారతదేశానికి అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ దీనిపై వితండవాదం చేస్తున్నారని ఆగ్రహించారు. 50 శాతం సీట్లు పెంచుతున్నామని చెప్పినా ఉత్తర భారతదేశానికి నేరుగా లాభం జరుగుతుందని ఆరోపించారు రేవంత్ రెడ్డి. రాజకీయంగా అవసరం ఉన్నప్పుడే సౌత్ ఇండియాను పట్టించుకోవడం లేదని.. ఇక నియోజకవర్గాల పునర్విభజన జరిగితే సౌత్ ఇండియా అవసరం లేకుండా పోతుందని విమర్శించారు.

రాజకీయ పార్టీల సమస్య కాదు..

ఇది పార్టీల సమస్య కాదని.. సౌత్ ఇండియా, ప్రజా సమస్యని చెప్పుకొచ్చారు. దక్షిణ భారత ప్రజల కోసం లక్ష్మణ్ రాజీనామా చేయాలని.. సౌత్, నార్త్ మధ్య అంతరం పెరగొద్దని హితవుపలికారు. తిరుగులేని పాలన వస్తే నియంతృత్వం వస్తుందని.. అది జరగటానికి వీల్లేదని తేల్చి చెప్పారు. దేశంలో బ్రూటల్ మెజార్టీ కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని.. బీజేపీ నాయకులు దీనిపై అవగాహన తెచ్చుకోవాలని హితవుపలికారు. బాగా పని చేస్తున్న సౌత్ ఇండియాను శిక్షించాలని చూస్తున్నారని మండిపడ్డారు. రేపటి నుంచి రెండు రోజుల పాటు తాను కేరళలో ఎన్నికల ప్రచారం చేయనున్నట్లు తెలిపారు.

త్వరలో క్యాన్సర్ పరీక్షలు..

రాష్ట్ర ప్రజలందరికీ త్వరలో క్యాన్సర్ పరీక్షలు నిర్వహిస్తామని భరోసా కల్పించారు రేవంత్ రెడ్డి. పంట మార్పిడి విషయంలో రైతులపై ఒత్తిడి తీసుకురామని.. వారికి అవగాహన కల్పిస్తామని తెలిపారు. పేదలకు ఇచ్చే సన్న బియ్యం కోసం రూ.14,560 కోట్లు ఖర్చు పెడుతున్నామని, దాంట్లో కోతలు పెట్టమని స్పష్టం చేశారు. సన్న బియ్యం పక్కదారి పట్టడం లేదని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సన్న బియ్యంతో అసెంబ్లీలో అందరికీ మంచి భోజనం పెట్టారన్నారు. పేదలందరికీ ప్రభుత్వ పథకాలు కచ్చితంగా అందుతాయని పేర్కొన్నారు ముఖ్యమంత్రి. వరి వేస్తే ఉరే అని కేసీఆర్ అన్నారని.. తాము మాత్రం వరి వేస్తే బోనస్ ఇస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు.

పోలికే లేదు..!

తనకు, కేసీఆర్‌కు పోలిక లేదని.. ఎన్నికల వేళ తాము ఏం చెప్పామో అదే చేస్తున్నట్లు తేల్చి చెప్పారు. కేసీఆర్ చెప్పిన దానికి చేసిన దానికి సంబంధం లేదని.. ఆయన ఉండటం వల్లే తనకు పేరొచ్చిందని ఎద్దేవా చేశారు రేవంత్. అన్ని పథకాలు కలిపితేనే ప్రజాపాలన అని, రైతులకు అవగాహన కల్పించడంలో మీడియా కీలకపాత్ర పోషించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మీడియా సామాజిక బాధ్యత తీసుకోవాలని సూచించారు. రూ.500ల గ్యాస్ విధానంలో ఎలాంటి మార్పులు లేవని గుడ్ న్యూస్ చెప్పారు. కేంద్రం సెస్ పేరుతో వసూలు చేస్తున్న డబ్బులు రాష్ట్రానికి ఇవ్వడం లేదని.. 34 శాతం మాత్రమే తిరిగి ఇస్తున్నారని మండిపడ్డారు. కేంద్రానికి నచ్చిన రాష్ట్రాలకు మాత్రమే సెస్ ఇస్తున్నారని ఆరోపించారు రేవంత్ రెడ్డి..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top