Prepare a Summer Action Plan : వేసవి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయండి జిల్లా యంత్రాంగానికి కలెక్టర్ కీలక ఆదేశాలు

TRINETHRAM NEWS
Prepare a summer action plan

Prepare a Summer Action Plan : అల్లూరి సీతారామరాజు జిల్లా, మార్చి 24, (త్రినేత్రంన్యూస్): రాబోయే తీవ్రమైన ఎండలు, ఉష్ణగాలుల దృష్ట్యా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో సమగ్ర “సమ్మర్ ఆక్షన్ ప్లాన్” రూపొందించుకోవాలని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
సోమవారం కలెక్టర్ తన చాంబర్ నుండి అల్లూరి, పోలవరం జిల్లాల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పలు ముఖ్య సూచనలు చేశారు. ప్రజలు ఎక్కువగా చేరే ప్రాంతాల్లో తక్షణమే చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఐటీడీఏ కార్యాలయాలు, కలెక్టరేట్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, సంతలు, ఆర్‌టీసీ బస్టాండ్లు, బస్సు షెల్టర్లు, పర్యాటక ప్రాంతాల్లో నీటి సౌకర్యాలు కల్పించాలన్నారు.
ఉపాధి హామీ పథకం పనులు నిర్వహించే కూలీలు, పాఠశాలలు, అంగన్వాడి కేంద్రాల వద్ద విద్యార్థులు వడదెబ్బకు గురికాకుండా తగిన నీడ, రక్షణ చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామాల్లో తాగునీటి కొరత తలెత్తకుండా నిరంతర పర్యవేక్షణతో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పశువులు, మేకల కోసం గ్రామస్థాయిలో ప్రత్యేకంగా నీటి కుంటలు ఏర్పాటు చేయాలని సూచించారు.
వ్యవసాయం, ఉద్యానవన రంగాల్లో సాగునీటి కొరత లేకుండా చెక్‌డ్యామ్‌ల ద్వారా పంట పొలాలకు నీటి సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వడదెబ్బ నివారణకు అవసరమైన ORS ప్యాకెట్లు, ఫస్ట్ ఎయిడ్ కిట్లు, అత్యవసర మందులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు.
ప్రజలు కూడా ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని అప్రమత్తంగా ఉండాలని, మధ్యాహ్న సమయంలో అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. అనంతరం వడదెబ్బ నివారణ చర్యలపై అవగాహన కల్పించే పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీలు, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారులు, డీపీఓ, డీఎంహెచ్ఓ, డీఈఓ, డీఎఫ్‌ఓ, ఫైర్, ఆర్డబ్ల్యూఎస్, గ్రౌండ్ వాటర్, ఐసీడీఎస్, ఇరిగేషన్, అగ్రికల్చర్, ఆర్టీసీ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top