Let’s Fight Against Drugs : భగత్ సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్ కి వ్యతిరేకంగా పోరాడుదాం సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉమామహేశ్వరరావు

TRINETHRAM NEWS
Let's fight against drugs

Let’s Fight Against Drugs : అరకులోయ మార్చి 24, (త్రినేత్రంన్యూస్): స్వాతంత్ర్య సమరయోధుడు భగత్ సింగ్ స్ఫూర్తితో డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలించేందుకు యువత ముందుకు రావాలని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి వి. ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. సోమవారం నాడు అరకు వ్యాలీ మండల కేంద్రంలో భగత్ సింగ్ 95వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, యువతను బానిసలుగా మార్చే మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, డ్రగ్స్ మరియు గంజాయి వ్యాపారులను సమాజం నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. గంజాయి వ్యతిరేకంగా పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు సిఐటియు కార్యకర్త పెంచలయ్య కుటుంబానికి ఆర్థికంగా సహాయం అందించాలని కోరారు. నెల్లూరులో గంజాయి వ్యతిరేక ఉద్యమంలో యువతను పెద్ద ఎత్తున సమీకరించి పోరాటం సాగించిన విషయాన్ని గుర్తుచేశారు.
ఇటీవల కాలంలో అధికార పార్టీ డ్రగ్స్ నియంత్రణపై మాటల్లోనే పరిమితమవుతోందని, ఆచరణలో మాత్రం విఫలమవుతోందని విమర్శించారు. కొందరు ప్రజాప్రతినిధులే మాదకద్రవ్యాల వినియోగంలో పట్టుబడుతున్న ఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం గంజాయి నిర్మూలనపై తీసుకుంటున్న చర్యలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయని అన్నారు.
భగత్ సింగ్ చిన్న వయసులోనే దేశభక్తిని చాటుతూ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి, చిరునవ్వుతో ఉరికంబాన్ని అధిరోహించిన గొప్ప వీరుడని పేర్కొన్నారు. ఆయన చూపిన మార్గంలోనే సమాజంలోని చెడు అలవాట్లపై, ముఖ్యంగా డ్రగ్స్ మహమ్మారిపై పోరాడాలని యువతకు సూచించారు.
అంతర్జాతీయ స్థాయిలో యుద్ధాలు పెరగడం వల్ల అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలు దెబ్బతింటున్నాయని, దాని ప్రభావంగా ధరలు పెరిగి సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా డ్రగ్స్ వ్యతిరేకంగా సిఐటియు మరియు అనుబంధ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు దాడి రాజు, రాంబాబు, వంతల రాజు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top