యువతికి క్లిష్టమైన థైరాయిడ్ క్యాన్సర్ శస్త్రచికిత్స విజయవంతం
పాడేరు, మార్చి 11, (త్రినేత్రం న్యూస్): గిరిజన ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్న పాడేరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) మరో అరుదైన ఘనతను సాధించింది. 24 ఏళ్ల యువతికి అత్యంత క్లిష్టమైన థైరాయిడ్ క్యాన్సర్ శస్త్రచికిత్సను ఆసుపత్రి వైద్య బృందం విజయవంతంగా నిర్వహించింది.
అల్లూరి సీతారామరాజు జిల్లాలోని లింగాపుట్టు గ్రామానికి చెందిన యువతి కొంతకాలంగా మెడ వాపుతో బాధపడుతూ పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయించింది. వైద్యులు ఆమెకు పలు వైద్య పరీక్షలు నిర్వహించగా ‘పాపిల్లరీ కార్సినోమా ఆఫ్ థైరాయిడ్’ అనే క్యాన్సర్ వ్యాధి ఉన్నట్లు నిర్ధారించారు. అంతేకాకుండా, ఈ క్యాన్సర్ ఇప్పటికే మెడలోని ఎడమ వైపు లింఫ్ నోడ్‌లకు కూడా వ్యాపించినట్లు గుర్తించారు.
పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని వైద్య బృందం వెంటనే శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించింది. అత్యంత క్లిష్టమైన ‘టోటల్ థైరాయిడెక్టమీ’తో పాటు ‘మోడిఫైడ్ రాడికల్ నెక్ డిసెక్షన్’ విధానంలో శస్త్రచికిత్స నిర్వహించారు. ఈ ప్రక్రియలో థైరాయిడ్ గ్రంధితో పాటు క్యాన్సర్ సోకిన మెడలోని లింఫ్ నోడ్‌లను అత్యంత జాగ్రత్తగా తొలగించారు.
సాధారణంగా ఇలాంటి క్లిష్టమైన శస్త్రచికిత్సలు నగరాల్లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో మాత్రమే జరుగుతాయని, కానీ ఇప్పుడు పాడేరు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఈ స్థాయి చికిత్స అందించడం గర్వకారణమని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం బాధితురాలు వైద్యుల పర్యవేక్షణలో కోలుకుంటోందని వారు పేర్కొన్నారు.
దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా, సొంత జిల్లాలోనే ఉచితంగా ఇటువంటి ఖరీదైన చికిత్స అందుబాటులోకి రావడం పట్ల గిరిజనులు, రోగి బంధువులు ఆసుపత్రి వైద్యులకు మరియు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


