అనంతగిరి జనవరి 27, (త్రినేత్రంన్యూస్): అనంతగిరి మండలంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని జీ.టి.డబ్ల్యూ.ఏ బాలుర పాఠశాల వేదికగా జరిగిన ఈ కార్యక్రమం దేశభక్తి, జాతీయ సమైక్యతను ప్రతిబింబించేలా ఉత్సాహభరితంగా సాగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ అనంతగిరి మండల అధ్యక్షులు సిహెచ్ మురళి హాజరయ్యారు. ఆయనతో పాటు ఎగువశోభ పంచాయతీ టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షులు మట్టం శ్యామ్, జనసేన పార్టీ కార్యదర్శి లక్ష్మణ్, బుజ్జిబాబు తదితర ప్రముఖులు పాల్గొని విద్యార్థులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా సిహెచ్ మురళి మాట్లాడుతూ, “మనం ఈ రోజు స్వేచ్ఛగా గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నామంటే దానికి మహాత్మా గాంధీ, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, భగత్ సింగ్ వంటి మహనీయుల త్యాగాలే కారణం. వారు చూపిన ఆదర్శ మార్గంలో నడవడం ప్రతి భారతీయుడి బాధ్యత” అని అన్నారు.
అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్యాంగం ద్వారా ప్రజలకు లభించిన హక్కులు, స్వేచ్ఛలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందని పేర్కొన్నారు.
నేటి బాలలే రేపటి పౌరులని పేర్కొన్న ఆయన, ఆదివాసీ ప్రాంతాల్లో అమలులో ఉన్న 1/70 చట్టం, పీసా చట్టాల ప్రాముఖ్యతను విద్యార్థులకు వివరించారు. ఈ చట్టాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని తెలిపారు.
ఈ వేడుకలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు అప్పలస్వామి ఆధ్వర్యంలో, భాస్కరరావు మాస్టర్ అధ్యక్షతన నిర్వహించబడ్డాయి. కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు ప్రదర్శించిన దేశభక్తి గీతాలు, ఉపన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమం అనంతరం సిహెచ్ మురళి తన చిన్ననాటి గురువులు సొమరా మాస్టర్, మత్స్యలింగం మాస్టర్లను ప్రత్యేకంగా స్మరించుకుని, శాలువాలతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక నాయకులు, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని గణతంత్ర దినోత్సవాన్ని జాతీయ గర్వంతో, ఉత్సాహంగా జరుపుకున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


