Nationwide Movement : ఈవీఎం టాంపరింగ్ ఆరోపణలపై దేశవ్యాప్త ఉద్యమానికి శ్రీకారం – గంగారం గ్రామంలో పౌరుల స్పీడ్‌పోస్ట్ లేఖల కార్యక్రమం

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ : గంగారం: బీహార్ ఎన్నికల ఫలితాలు పలు అనుమానాలకు తావిస్తున్న నేపథ్యంలో, ఈవీఎంలలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాలని కోరుతూ దేశవ్యాప్తంగా ఉద్యమం ఊపందుకుంటోంది. ఈ క్రమంలో శుక్రవారం సంగారెడ్డి జిల్లా గంగారం గ్రామంలో సుమారు వంద మంది పౌరులు, ప్రజా సంఘాల ప్రతినిధులు కలిసి గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి కి స్పీడ్‌పోస్ట్ ద్వారా లేఖలు పంపించారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల విశ్వాసాన్ని పునరుద్ధరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈవీఎంలలో అవకతవకలు జరిగితే వాటికి సంబంధించిన ఆధారాలు ఎన్నికల్లో ఉపయోగించిన యంత్రాల్లోనే లభ్యమవుతాయని, అవి తిరిగి ఎన్నికల సంఘం వద్దకు చేరగానే ఆధారాలు చెరిగిపోయే అవకాశం ఉందని లేఖల్లో పేర్కొన్నారు. అందుకే ఎన్నికల్లో ఉపయోగించిన ఈవీఎంలను భారత సైన్యం ఆధీనంలో భద్ర పర్యవేక్షణకు అప్పగించి, స్వతంత్రంగా ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. పారదర్శకత, నిష్పక్షపాతత కోసం ఈ చర్యలు అత్యవసరమని వారు అభిప్రాయపడ్డారు.

ఈ కార్యాచరణను దేశవ్యాప్తంగా విస్తరించాలని యువత ముందుకొచ్చింది. ఒక్క గ్రామంలోనే వందల సంఖ్యలో లేఖలు పంపగలిగితే, దేశవ్యాప్తంగా అమలు చేస్తే కోట్ల సంఖ్యలో లేఖలు వెళ్లి, ఫోరెన్సిక్ పరీక్షల ద్వారా వాస్తవాలు వెలుగులోకి రావచ్చని వారు పేర్కొన్నారు. దోషులు ఉంటే శిక్ష పడేలా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని, తద్వారా ప్రజాస్వామ్యంపై ప్రజల నమ్మకం బలపడుతుందని అభిప్రాయపడ్డారు.

ఈ ఉద్యమం దేశవ్యాప్త రూపం దాల్చనుందని పాల్గొన్నవారు విశ్వాసం వ్యక్తం చేశారు. గౌరవ భారత ప్రధాన న్యాయమూర్తి కి పంపుతున్న స్పీడ్‌పోస్ట్ కవర్లతో వందల మంది ప్రజలు ఒకే స్వరంతో తమ ఆవేదనను తెలియజేయడం ద్వారా ఇది జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తుందని పేర్కొన్నారు. ఈవీఎంలపై ఉన్న అనుమానాలను తొలగించేందుకు, అవసరమైతే పాత బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించే అంశాన్ని కూడా పరిశీలించాలని, ఇందుకు భారత సుప్రీంకోర్టు తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో పౌర సమాజానికి చెందిన నేటివ్ ఇండియా ఫోరమ్ జాతీయ అధ్యక్షులు బీరయ్య యాదవ్, స్థానిక నేటివ్ ఇండియా ఫోరమ్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బత్తుల విక్రమ్, సద్దాం హుస్సేన్, తాజా మాజీ సర్పంచ్ వి. నర్సిములు, కే. నాగేందర్, సాజీద్, రాంచందర్, ఆనంద్ సార్, వి. భాస్కర్, జంగం భద్రయ్య స్వామి, మంగళి ప్రభు, బి. ప్రవీణ్ కుమార్, ఎస్. బాబూరావు,బి.ఉదయ్ కిరణ్, ప్రజ్యోత్ కుమార్, వి ప్రవీణ్ కుమార్, అంజద్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. గంగారం గ్రామానికి చెందిన చిన్నలు, పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమానికి మద్దతు తెలిపారు. ప్రజాస్వామ్య పరిరక్షణే లక్ష్యంగా ఈ ఉద్యమం కొనసాగుతుందని నిర్వాహకులు స్పష్టం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Nationwide movement launched against EVM tampering allegations

You cannot copy content of this page

Scroll to Top